ఎన్టీఆర్ కు ద్రోహం చేసిందెవరో ఆత్మసాక్షిని అడుగు- కొడాలి నానికి నందమూరి రామకృష్ణ కౌంటర్
దివంగత సీఎం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమయ్యారంటూ నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేస్తున్న విమర్శలకు నందమూరి కుటుంబ సభ్యులు మరోసారి ఘాటుసమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో జరుగుతున్న ఆయన శతజయంతి వేడుకలకు హాజరైన వారు.. కొడాలి తీరుపై మండిపడ్డారు. అదే సమయంలో కొడాలికి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయేనని గుర్తుచేశారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని పోషించింది, రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి వంశమని గుర్తుపెట్టుకోవాలని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని కొడాలి చేస్తున్న విమర్శలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పందించిన రామకృష్ణ.. ఎవరు ఎవరిని మోసం చేశారో అతని ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. తెలుగు దేశం పార్టీని వాడుకుని కొడాలి నానే నందమూరి కుటుంబాన్ని మోసం చేశాడని నందమూరి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితులపై మాట్లాడిన నందమూరి వారసుడు.. తెలుగు ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారన్నారు. అభివృద్ధిలో రాష్ట్రంల 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, అడుక్కోవడానికి చిప్ప కూడా దొరకని పరిస్దితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్రానికి పూర్వవైభవం రావాలన్నా, దేశంలో మొదటి స్ధానంలో రాష్ట్రం నిలవాలన్నా తిరిగి చంద్రబాబుకే సాధ్యమని నందమూరి రామకృష్ణ తెలిపారు.

కృష్ణాజిల్లాలో మూడు రోజుల పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ఇవాళ గుడివాడలో రోడ్ షో, బహిరంగసభ నిర్వహించనున్నారు. అంతకు ముందే కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. గతంలోనూ ఎన్టీఆర్ కు వెన్నుపోటుపై వైసీపీ నేతలు పదే పదే చేస్తున్న వ్యాఖ్యలకు పలుమార్లు నందమూరి వారసులు జవాబిచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ స్వగ్రామం నుంచి మరోసారి కొడాలికి కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications