జనంలోకి భువనేశ్వరి, నేడే ఆరంభం - గేమ్ ఛేంజర్ అవుతారా..!!
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ రోజు నుంచి నిజం గెలవాలని జనం మధ్యకు వెళుతున్నారు. నారావారి పల్లె నుంచి భువనేశ్వరి యాత్ర ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్టుతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని, అసత్య ఆరోపణలతో జైల్లో పెట్టారన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ యాత్ర నిర్వహణ ఇప్పుడు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారుతోంది.
భువనేశ్వరి యాత్ర:నారా భువనేశ్వరి ఎన్నికల వేళ ప్రజల్లోకి వస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో మారిన సమీకరణాల నేపథ్యంలో భువనేశ్వరి యాత్ర రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయం నంచి భువనేశ్వరి రాజమండ్రిలోనూ ఉంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనసేనాని పవన్ తో పాటుగా పార్టీ నేతలతోనూ సమావేశమయ్యారు. ఇక, ఇప్పుడు నిజం గెలవాలి పేరు తో యాత్ర ప్రారంభిస్తున్నారు. సోమవారం ఉదయం ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి అనంతరం నారావారిపల్లి లో గ్రామ దేవత, కులదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు అమ్మనమ్మల సమాధుల వద్ద నివాళులు అర్పించారు.

టీడీపీకి ప్రతిష్ఠాత్మకం:భువనేశ్వరి యాత్రకు టీడీపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో మూడు రోజులు పర్యటించేలా పార్టీ అంతరంగం ముందుగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల పాటు పర్యటనను ఖరారు చేసింది. మొదట రాయలసీమ జిల్లాల్లో ఈ పర్యటన సాగనుంది. మహిళలతో పెద్దఎత్తున సభ నిర్వహించేందుకు టీడీపీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
తొలి రోజు పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన చిన్నబ్బ, చంద్రగిరికి చెందిన ప్రవీణ్ రెడ్డి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అగరాలలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనేలా తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోనూ నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేసారు.

రాజకీయంగా ఆసక్తి:ఇదే సమయంలో నారా భువనేశ్వరి భావోద్వేగంో ట్వీట్ చేశారు. చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్ళానని.. ఈ ప్రయాణం భారంగా ఉందంటూ ఏమోషనల్ అయ్యారు. దేవుడి దయతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నన్నారు భువనేశ్వరి. ‟ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను.. బాబు జైల్లో ఉన్న కారణంగా ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం ఎంతో బాధ కలిగించింది.
ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను" అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ యాత్ర ద్వారా భువనేశ్వరి రాజకీయంగా గేమ్ ఛేంజర్ అవుతారా..ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications