2024లో సీఎంగా చంద్రబాబు- జనవరిలో జాబ్ క్యాలెండర్-పెద్దిరెడ్డి ఎందులో పెద్దాయన-లోకేష్ కామెంట్స్
ఏపీలో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ నేత నారా లోకేష్ ఇవాళ పుంగనూరు నియోజకవర్గంలో నడిచారు. ఈ సందర్భంగా స్ధానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. వచ్చే ఏడాది చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారని, తర్వాత ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. అలాగే స్ధానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు చివరకు పోలీసులు కూడా బాధితులేనని నారా లోకేష్ ఆరోపించారు. తాను టెర్రరిస్టును కాదని, వారియర్ నని లోకేష్ అన్నారు. గతంలో ఊరూరా తిరుగుతా నిరుద్యోగులకు 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని, దాన్ని నెరవేరిస్తే తన మైక్ వెహికల్ ఇచ్చేస్తానన్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేశారని, ఇప్పటికైనా ఇస్తే తన మైక్ ఇస్తానన్నారు. ప్రతియేటా 6500 పోలీసు ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని, అవి అమలు చేస్తే తన సౌండ్ వెహికల్ జగన్ కు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తానన్నారు. ప్రతియేటా మెగా డీఎస్సీ నిర్వహిస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని, దాన్ని అమలు చేస్తే తన మైక్ ఇస్తానన్నారు. 2024మే నెలలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని లోకేష్ తెలిపారు. అనంతరం 2025జనవరికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యతను లోకేష్ తీసుకుంటాడని హామీ ఇచ్చారు.

మరోవైపు పుంగనూరులో స్ధానిక మంత్రి పెద్దిరెడ్డిపై లోకేష్ విమర్శలు చేశారు. పుంగనూరులో పీ3 ఫార్ములా అమలవుతోందన్నారు. పుంగనూరు, పెద్దిరెడ్డి, పాపాలు...ఈ నియోజకవర్గంలో ఒక్క పనికూడా జరగలేదన్నారు. పెద్దిరెడ్డిని ఎవరైనా పెద్దాయనా అనాలంట. భూములు దోచినందుకు, ఇసుక తిన్నందుకు, మట్టిమాఫియాను ప్రోత్సహించినందుకా? అని ప్రశ్నించారు. గంజాయిని ఎక్కువగా సరఫరా చేస్తున్నందుకు పెద్దిరెడ్డిని పెద్దాయన అనాలా? అని అడిగారు. పిఎల్ఆర్ కాంట్రాక్టు ఎవరూ తీసుకోవడం లేదన్నారు. గతంలో ఒక వైసీపీ నాయకుడు తీసుకున్నాడని, పనులు చేశాడని, బిల్లులు రాక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడన్నారు.
పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ కోసం మిగతా డెయిరీలను నాశనం చేస్తున్నాడని లోకేష్ ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, దీంతో రైతులు ఆవులను అమ్మేసుకున్నారన్నారు. రెండున్నర ఏళ్లలో శివశక్తి సంస్థ రైతుల కష్టార్జితం 20 కోట్ల రూపాయలు దోచుకుందన్నారు. రాష్ట్రమంతా అమూల్ కంపెనీలను పెట్టిన జగన్ రెడ్డి...పుంగనూరులో మాత్రం పెట్టలేదన్నారు. అది కేవలం పెద్దిరెడ్డి కోసమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తారని, పుంగనూరును ప్రక్షాళన చేస్తాం...పాపాలన్నిటికీ చెక్ పెడతామన్నారు. పెద్దిరెడ్డి తమ్ముడి కొడుకు సుదీర్ రెడ్డి పల్ప్ కంపెనీ కోసం మామిడి రైతులు పంట తమకే అమ్మాలని బెదిరిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. బయటివారికి మామిడి పంటను అమ్మకుండా పెద్దిరెడ్డి అడ్డుపడుతున్నాడన్నారు. బెదిరించి లాక్కున్నాడన్నారు. మామిడి రైతుల నుంచి మూడేళ్ల కాలంలో పెద్దిరెడ్డి సంస్థ 100 కోట్ల రూపాయల దోచుకుందన్నారు.

కల్లూరులో 5ఎకరాల భూములను దేవుడి భూమిని పెద్దిరెడ్డి మనుషులు దోచేశారన్నారు. అడ్డుపడినందుకు ఈఓను బదిలీ చేశారన్నారు.వెంకటరెడ్డియాదవ్, నాగభూషణం, భాస్కర్ రెడ్డి అనే వ్యక్తులు పుంగనూరు నియోజకవర్గంలో భూములు కబ్జా చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. వారికి భయపడి రైతులు రాత్రివేళ టార్చి లైట్లు వేసుకుని తమ భూములకు కాపలా కాసుకుంటున్నారన్నారు. 300ఎకరాల ఫారెస్ట్ భూమిని కూడా పెద్దిరెడ్డి దోచేశారని, ఈ భూమి విలువ రూ.500 కోట్లన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎవరు క్వారీ నిర్వహించుకోవాలన్న మంత్రి పెద్దిరెడ్డికి 50 శాతం కమీషన్ ఇచ్చుకోవాల్సిందేనన్నారు.
ఈ కమీషన్ల రూపేణా పెద్దిరెడ్డి నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా 500 కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో మంత్రి పెద్దిరెడ్డి ఇసుక అక్రమంగా తవ్వి బెంగళూరుకు తరలిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. మొత్తంగా గత నాలుగేళ్లలో పెద్దిరెడ్డి దోచుకున్న పాపపు సొమ్ము విలువ రూ.10వేలకోట్లని లోకేష్ తెలిపారు. పెద్దిరెడ్డి చేసిన పాపాలన్నీ బయటకు తీస్తామన్నారు. పెద్దిరెడ్డి దోచుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టి వాటిని పుంగనూరు ప్రజల కోసం ఖర్చు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications