Nara Lokesh : మైనార్టీలకు నారా లోకేష్ కీలక హామీ-ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు
2024లో టీడీపీ అధికారంలోకి వస్తే ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని శ్రీకాళహస్తిలో పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ హామీ ఇచ్చారు.
ఏపీలో యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ శ్రీకాళహస్తికి చేరుకున్నారు. నగరంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆయన స్ధానికంగా ముస్లింలతో భేటీ అయ్యారు. వారు ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. వారికి ఓ కీలక హామీ కూడా ఇచ్చారు.

ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. శ్రీకాళహస్తిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ముస్లింలతో భేటీ అయిన నారా లోకేష్.. వైసీపీ ప్రభుత్వంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందించారు. ముఖ్యంగా మైనార్టీ కార్పోరేషన్ నిర్వీర్యం అయిందని, దీంతో ముస్లింలకు రుణాలు అందడం లేదని లోకేష్ తెలిపారు. ముస్లింలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు.

2024లో జరిగే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి ముస్లింలను ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తగిన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కల్పిస్తామని లోకేష్ వెల్లడించారు. అలాగే ఇండస్ట్రీ క్లస్టర్‌లలోనూ ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తామన్నారు. టీడీపీ హాయాంలో శ్రీకాళహస్తి పరిసరాల్లో పరిశ్రమలు తీసుకొచ్చామని, ఇప్పుడు ఆ పరిశ్రమల్లో పది వేల మంది వరకు పని చేస్తున్నారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రస్తుతానికి లక్ష మంది పని చేస్తూ ఉండేవాళ్ళని అన్నారు.












Click it and Unblock the Notifications