లోకేశ్ అలక: శిక్షణా తరగతులకు గైర్హాజరు, బాబు నిర్ణయమే కారణమా?
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అలిగారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దసరాకు మంత్రి వర్గ విస్తరణ ఉందంటూ గతంలో మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఐదుగురు మంత్రులకు ఉద్వాసన: వారెవరు, చంద్రబాబు ప్లానేమిటి?
అయితే కొన్ని కారణాల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేశారు. దీంతో లోకేశ్ గుర్రుగా ఉన్నారంటూ పార్టీ వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే టీడీపీ నిర్వహిస్తున్న పార్టీ శిక్షణా తరగతులకు వరుసగా రెండో రోజు కూడా లోకేశ్ గైర్హాజరు కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

గుంటూరు జిల్లాల వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో టీడీపీ కార్యకర్తలకు శిక్షణా తరగతులకు అధినేత చంద్రబాబు మంగళవాం ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి రోజు శిక్షణా తరగతులకు హాజరుకాని లోకేశ్ రెండో రోజైన బుధవారం హాజరవుతారని అందరూ భావించారు..
అయితే రెండో రోజు కూడా ఆయన గైర్హాజరయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో లోకేశ్ ఎక్కడ? అనే ప్రశ్న టీడీపీ నాయకుల్లో మొదలైంది. దీంతో ఆయన అలిగారంటూ పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది.
లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు కొద్దిరోజుల క్రితం గవర్నర్ నరసింహన్‌కు చంద్రబాబు చెప్పినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లోకేశ్‌కు మంత్రి పదవి ఖాయమన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ మాదిరి లోకేశ్‌ను కూడా మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చాలా కాలంగా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అందులో లోకేశ్‌కు మంత్రి పదవి దక్కడ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఏమైందో ఏమో గానీ దసరాకు ముహూర్తం కుదరక చంద్రబాబు తన మంత్రి వర్గ విస్తరణను వాయిదా వేశారు.
దీంతో మంత్రి వర్గ విస్తరణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న లోకేశ్‌కు చంద్రబాబు నిర్ణయం కాస్తంత నిరుత్సాహానికి గురిచేసినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు ఆయన హాజరుకాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications