పవన్ కళ్యాణ్ చెప్పినట్లే: నారాయణ ఓకే, రాజధానితో 20రెట్లు పెరిగింది
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఏ రైతును ఇబ్బంది పెట్టకుండా తాము భూసేకరణ చేస్తున్నామని మంత్రి నారాయణ శుక్రవారం నాడు చెప్పారు. ఈ నెల 20వ తేదీలోగా ల్యాండ్ పూలింగ్‌కు రైతులు మందుకు రావాలని సూచించారు.
ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ పూర్తయిందని, ఈ నెల 20లోగా రైతులు ముందుకు రావాలన్నారు. ఆ తర్వాతనే భూసేకరణ చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు తాము ఏ రైతులను ఇబ్బంది పెట్టమని చెప్పారు.
ఇప్పటి వరకు రాజధాని భూమి కోసం 34వేల ఎకరాలను సేకరించామని చెప్పారు. మరో 2,200 ఎకరాలు అవసమని తెలిపారు. రాజధాని ప్రకటన తర్వాత భూమి ధర భారీగా పెరిగిందన్నారు. ఇరవై రెట్లకు పైగా పెరిగిందని చెప్పారు.
గతంలో భూమి ధర రూ.పది లక్షలకు వరకు ఉండేదని, ఇప్పుడు కోటి నుంచి రెండు కోట్ల వరకు పలుకుతుందని చెప్పారు. రాజధాని సలహా మండలి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం భేటీ అయింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు.

ఆర్టీసీ విభజనపై చర్చలు
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్టీసీ ఆస్తులు, ఉద్యోగుల సంఖ్య, కొత్త నియామకాలు తదితర అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఆర్టీసీ ఎండీ సాంబశివ రావుతో చర్చించారు. ఆర్టీసీని పూర్తిస్థాయిలో విభజించాక ఉద్యోగుల నియామకాలు, బదిలీల విషయంపై కూడా ఆయన ఆరా తీశారు.
కాగా, ఎస్‌బిఐలోని ఏపీ ఇంటర్ బోర్డుకు చెందిన బ్యాంకు ఖాతాలు నిర్వహించుకునేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ అనుమతించింది. బ్యాంక్ ఖాతాలను స్తంభింప చేయాలంటూ తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి రాసిన లేఖను రద్దు చేసింది.
అయితే, ఆ ఖాతాలు స్తంభింపే చేసే నాటికి వాటిలో ఉన్న నిల్వలు డ్రా చేయబోమని కోర్టుకు హామీ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ఏజీ ఇచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్లే, జస్టిస్ ఎస్వీ భట్‌తో కూడిన న్యాయస్థానం గురువారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications