రెచ్చగొట్టడం: పవన్ టూర్‌పై నారాయణ, బాబు హెచ్చరిక
హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటనను మంత్రి నారాయణ స్వాగతించారు. అదే సమయంలో కొందరు నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రైతుల బాధను వినేందుకు ఉండవల్లి, బేతపూడి, ఎర్రబాలెం, తుళ్ళూరు గ్రామాల్లో పవన్ పర్యటించడాన్ని స్వాగతిస్తున్నామని నారాయణ అన్నారు.
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలోని మునుగోలు మండలం నడమనారులో సేవ్ ది క్రాప్ పథకం కింద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పంటలను ఎండి పోనీయమని రైతులకు హామీ ఇచ్చారు. సాగునీటి కొరత రానీయమన్నారు.
రాజధాని విషయంలో కొంతమంది నేతలు రైతులను రెచ్చగొడుతున్నారని, రైతులను రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. రాజధాని నిర్మాణం ప్రారంభమైతే భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయన్నారు.

జూన్‌లో రాజధాని ప్లాన్
రాజధాని అంటే వంద, వెయ్యి ఎకరాలు కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేరుగా అన్నారు. సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక అవసరాలు తీరాలన్నారు. రాజధాని నిర్మాణం ప్రారంభమైతేనే రైతుల భూముల విలువ పెరుగుతుందన్నారు. రాజధాని కోసం రైతులే ముందుకొచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసేకరణ పూర్తయిన తర్వాత ప్రతిపక్షనేత జగన్ రాజధాని ప్రతిపాదిత గ్రామంలో పాదయాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉందని నారాయణ ఎద్దేవా చేశారు.
రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 32, 240 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారన్నారు. శాంతియుతంగా భూసమీకరణ పూర్తయిన తర్వాత ప్రతిపక్షనేత జగన్ ఆ ప్రాంతంలో పర్యటించడం, తాను అదికారంలోకి వచ్చిన తర్వాత రైతుల భూమిని తిరిగిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
భూముల విషయంలో ఇబ్బందులు కలిగిస్తే రైతులు నష్టపోతారని చంద్రబాబు హెచ్చరించారు. భూసమీకరణను వ్యతిరేకించే వారు ప్రపంచం ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలని సూచించారు. రాజధాని అంటే ప్రజల భవిష్యత్ అన్నారు. రాజధాని వచ్చాక ఇంకా ఎక్కువ ధరలకు అమ్ముకోవాలనే పేరాశతోనే కొందరు భూములు ఇవ్వడం లేదన్నారు.
కమ్యూనిస్టు పార్టీల ఆఫీసులకు పదెకరాలు కావాలి, రాజధానికి మాత్రం వెయ్యి ఎకరాలు చాలంటారని ఎద్దేవా చేశారు. ఎన్ని వేల ఎకరాల్లో హైదరాబాద్ విస్తరించిందో తెలుసా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని, జూన్‌లో రాజధాని మాస్టర్‌ప్లాన్ అందుతుందన్నారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్, జపాన్ సహకారం ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications