మాంసాహారం వల్లే ప్రకృతి విపత్తులు: ఐఐటీ మండి డైరెక్టర్ సంచలనం!!
హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల వర్షాలు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ లో కురిసిన వర్షాల వల్ల భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది.
హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మికంగా వర్షాలు వరదలు రావడం, కొండ చరియలు విరిగి పడడం, క్లౌడ్ బరస్ట్ లు సంభవించడం వంటి అనేక విపత్తుల నేపథ్యంలో తాజాగా హిమాచల్ ప్రదేశ్ ఐఐటి మండి డైరెక్టర్ గా ఉన్న లక్ష్మీ ధర్ బెహెరా విపత్తులకు వింత లాజిక్ ను చెప్పారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల పై మాట్లాడిన ఆయన ప్రజల మాంసాహార అలవాట్ల వల్లే ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. జంతువులపై క్రూరత్వమే ప్రకృతి కన్నెర్ర చేయడానికి కారణమని ఆయన తెలిపారు. అంతే కాదు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన బెహెరా మాంసం తినకూడదని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
మాంసాహారం మానెయ్యండి అని సూచించారు. పరస్పర ఆధారిత సహజీవులను వధిస్తూ ఉండటమే పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోందని రాష్ట్రంలో జరుగుతున్న విపత్తులు వాటి ఫలితమేనని ఐఐటి మండి డైరెక్టర్ లక్ష్మీ ధర్ బెహెరా పేర్కొన్నారు. మంచి వ్యక్తిగా మారడానికి, జంతువుల పట్ల క్రూరత్వాన్ని తగ్గించి మాంసాహారం మానెయ్యాలని చెప్పారు.
మాంసాహారం ముట్టమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయాలని పిలుపునివ్వడం, మాంసాహారం తినడమే ప్రకృతి విపత్తులకు కారణమని చెప్పడం ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీసింది. నెటిజన్లు బెహెరా వ్యాఖ్యల పైన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గతంలో కూడా ఆయన మంత్ర పఠనం ద్వారా దుష్ట శక్తుల నుండి తన స్నేహితుడిని విడిపించానని చెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఇప్పుడు మాంసాహారమే ప్రకృతి విపత్తులకు కారణం అని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications