ఎన్టీఏ నాటి మిత్రులకు బీజేపీ పిలుపు, టీడీపీ తేల్చేసింది- పవన్ ఏం చేస్తారు..!!
కేంద్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని మోదీ రాజకీయంగా..పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. ఎన్డీఏ విస్తరణలో భాగంగా పాత మిత్రులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 18న పాత మిత్రులు..ఎన్డీఏ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి గతంలో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి దూరమైన వారిని ఆహ్వానించారు. ఏపీలో టీడీపీ, జనసేన ఈ సమావేశంలో పాల్గొంటాయా..ఏం జరుగుతోందనేది ఆసక్తిగా మారుతోంది.
ఎన్డీఏ నాటి మిత్రులకు ఆహ్వానం
బీజేపీ నాయకత్వం ఎన్డీయే మిత్రపక్షాలను మరింత సంఘటితం చేయడం... దూరమైన పార్టీలను దగ్గరికి చేర్చుకోవడంపై దృష్టి సారించింది. ఈ దిశగా ఈనెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గతంలో ఎన్డీయేలో ఉండి... వేర్వేరు కారణాలవల్ల దూరమైన పార్టీలనూ ఈ భేటీకి ఆహ్వానిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి రాలేనిపక్షంలో... మిత్రుల మద్దతు కీలకమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో... 18వ తేదీన బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్డీయే మిత్రపక్షాల భేటీ ఏర్పాటు చేసింది. ఎన్డీయేలో గతంలోఉన్న పార్టీలను తిరిగి కూటమిలోకి ఆహ్వానించాలని భావిస్తోంది.
ఈ సమావేశానికి నాటి మిత్రపక్షంగా టీడీపీ హాజరవుతుందని ప్రచారం సాగినా..తమకు సమాచారం లేదని తెలుగుదేశం స్పష్టం చేసింది.
సమాచారం లేదన్న టీడీపీ
ఎన్డీయేలో బీజేపీ, శివసేన (ఏకనాథ్ షిండే వర్గం), రాష్ట్రీయ లోక్ జనశక్తి (చిరాగ్ పశ్వాన్ వర్గం), అన్నాడీఎంకే, అప్నాదళ్ (సోనెలాల్ ), నేషనల్ పీపుల్స్ పార్టీ (మేఘాలయ), నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (నాగాలాండ్), ఆల్ జార్ఘండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ (జార్ఖండ్) తో పాటు పలు చిన్నా చితక పార్టీలున్నాయి. ఇటీవల బిహార్‌లో జితన్ రాం మాంఝీకి చెందిన హిందూస్థాన్ ఆవాం మోర్చా ఎన్డీయేలో చేరింది.

తాజాగా అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సీపీ మహారాష్ట్రలో బీజేపీతో చేతులు కలిపింది. కర్ణాటకలో జనతాదళ్ (ఎస్) నేత దేవెగౌడ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకోవడంతో ఆ పార్టీ ఎన్డీయేలో చేరటం ఖాయమని తెలుస్తోంది. అకాలీదళ్‌ను తిరిగి కూటమిలో చేర్చుకునేందుకు ఇటీవలి కాలంలో బీజేపీ తీవ్ర యత్నాలు చేసింది. ఢిల్లీలో జరిగే ఎన్డీయే సమావేశానికి తాము హాజరవుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని టీడీపీ స్పష్టం చేసింది. ఇటువంటి సమావేశం ఉన్నట్లు కూడా తమకు సమాచారం లేదని తెలిపింది.
పవన్ ను పిలుస్తారా..కలుస్తారా
ఒక కూటమిలో చేరేముందు అనేక విషయాలపై రాజకీయ చర్చలు జరగాలని.. ఏదీ లేకుండా సమావేశానికి హాజరు కావడం జరగదని టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీకి జనసేన అధికారికంగా మిత్రపక్షంగా కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ ను ఈ భేటీకి ఆహ్వానిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఏపీలో టీడీపీ,బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని పవన్ భావిస్తున్నారు.

ఈ క్రమంలో టీడీపీ, జనసేన విషయంలో బీజేపీ ఏం చేయబోతోంది..అధికారికంగా ఆహ్వానం పలుకుతారా..లేక జనసేనకు మాత్రమే ఆహ్వానం పంపుతారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీ నుంచి ఆహ్వానం వస్తేనే స్పందించాలనే ఉద్దేశంతో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో..ఏపీలో పొత్తుల వ్యవహారం ఈ భేటీకి ఆహ్వానాలు..హాజరు ద్వారా స్పష్టత రావటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications