జగన్‌తో రహేజా భేటీ: విశాఖలో భారీ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు ఆహ్వానం
అమరావతి: ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా మారబోతోన్న సాగర నగరం విశాఖపట్నంలో మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతోంది. ఇప్పటికే 14,500 కోట్ల రూపాయల వ్యయంతో అదాని డేటా సెంటర్ ఇక్కడ రూపుదిద్దుకుంటోంది. కొద్దిరోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఇక తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ విశాఖలో ఏర్పాటు కానుంది.
అదే- ఇనార్బిట్ మాల్. దేశీయ పారిశ్రామిక దిగ్గజం కే రహేజా గ్రూప్ దీన్ని నిర్మించబోతోంది. 17 ఎకరాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కాబోతోంది ఈ బిగ్గెస్ట్ షాపింగ్ మాల్. దీనికి సంబంధించి ప్రాథమిక ఒప్పందాలు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలోనే మాల్ నిర్మాణ పనులను రహేజా సంస్థ మొదలు పెట్టనుంది.

విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సాలిగ్రామపురంలో దీన్ని నిర్మించనుందా సంస్థ. విశాఖ పోర్ట్‌కు చెందిన గెస్ట్ హౌస్ స్థలంలో దీన్ని నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. శిథిలావస్థకు చేరుకున్న విశాఖ పోర్ట్ గెస్ట్ హౌస్ స్థలాన్ని 30 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. దీనికోసం 125 కోట్ల రూపాయలను వైజాగ్ పోర్ట్‌కు చెల్లించింది.
ఈ భారీ మాల్‌ను మూడు సంవత్సరాల వ్యవధిలో నిర్మించే అవకాశాలు ఉన్నాయి. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇనార్బిట్ మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మలద్, వసై, నవీ ముంబై, వడోదర.. వంటి నగరాల్లో ఇవి నిర్మతం అయ్యాయి. ఇక తాజాగా విశాఖపట్నం కూడా ఈ జాబితాలో చేరనుంది.

ఈ నేపథ్యంలో కే రహేజా సంస్థ చీఫ్ నీల్ రహేజా.. కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు.తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిశారు. మాల్ శంకుస్థాపనకు రావాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట తెలంగాణా ఇనార్బిట్ మాల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనె శ్రావణ్ కుమార్ ఉన్నారు.
విశాఖలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్‌ను నిర్మించబోతోన్నామని, దీనికోసం మూడేళ్లలో 600 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టడంపై ముఖ్యమంత్రితో చర్చించారు. కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్‌లు ఉన్నారు.












Click it and Unblock the Notifications