జగన్ .. మీకు తెలుసుగా..! వేమిరెడ్డి ఘాటు కౌంటర్..!
ఏపీలో ఒకప్పుడు వైసీపీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి, ఆ తర్వాత గత లోక్ సభ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీని వీడి టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన నెల్లూరు జిల్లా నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు మరింత యాక్టివ్ అయ్యారు. గతంలో వైసీపీలో పనిచేసినప్పుడు జగన్ కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న వేమిరెడ్డి.. ఆ తర్వాత పార్టీని వీడటంతో వైసీపీ నేతలు ఆయన్ను టార్గెట్ చేశారు. దీంతో ఆయన మైనింగ్ వ్యాపారం నుంచి కూడా వెనక్కి తగ్గారు.
అయితే అపర దానకర్ణుడిగా పేరున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వ్యాపారాలతో పాటు సేవా కార్యక్రమాలలోనూ చురుగ్గా ఉంటారు.
ఇదే క్రమంలో గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసి ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి అప్పట్లో పీఏగా పనిచేసిన అప్పన్నకు ఆర్ధిక సాయం కూడా చేసారు. కానీ ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో అప్పన్న పాత్రపై విచారణ జరుగుతున్న వేళ.. ఆయనకు సాయం చేసిన వేమిరెడ్డిని కూడా జగన్ ఇందులోకి లాగారు.

తిరుమల లడ్డూ వివాదంపై టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో జగన్ అప్పన్న గురించి మాట్లాడుతూ వేమిరెడ్డి గురించి ప్రస్తావించారు. దీనిపై వేమిరెడ్డి తాజాగా స్పందించారు. నెల్లూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న వేమిరెడ్డి అప్పన్నకు తాను చేసిన సాయాన్ని ప్రస్తావించారు. జగన్ తనపై అనవసరంగా కామెంట్స్ చేశారంటూ మండిపడ్డారు. తానేంటో ఆయన ఆత్మకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేశారు. సుబ్బారెడ్డి దగ్గర పనిచేస్తున్న అప్పన్నకు ఎవరు చెప్తే తాను సాయం చేశానో జగన్ కు తెలియదా అని వేమిరెడ్డి ప్రశ్నించారు. అలాగే జగన్ మాట్లాడే విషయాలు నిజమా కాదా అనేది దేవుడిపై ప్రమాణం చేయాలన్నారు.

సాయం కోసం ఎవరు అడిగినా తాను చేస్తుంటానని, ప్రతీ నెలా తాను సాయం చేసే వారిలో చాలా మంది ఉంటారని, అందులో అప్పన్న కూడా ఉన్నారని వేమిరెడ్డి తెలిపారు. అలాగే ఎవరు చెప్తే తాను అప్పన్నకు సాయం చేశానో కూడా జగన్ కు తెలుసన్నారు. కాబట్టి తనపై అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ఒక్కోసారి సాయం చేయడమే కాకుండా నిందలు కూడా పడాల్సి వస్తోందని వేమిరెడ్డి వాపోయారు. ఎంత చేశామో, ఏం చేశామో ఆ దేవుడికే తెలుసని, జగన్ మాటలు బాధ కలిగించడం వల్లే తాను స్పందించాల్సి వస్తోందన్నారు.












Click it and Unblock the Notifications