చేనేతలకు శుభవార్త.. త్వరలో ‘నేతన్నల సేవలో' రెండో విడత ఆర్థికసాయం!
ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు మరో శుభవార్త. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను అందిస్తోంది. నేతన్నల సేవలో, ఉచిత విద్యుత్ పథకం వంటి పథకాలను అందిస్తున్న ఏపీ సర్కార్ అడుగడుగునా నేత కార్మికులకు అండగా ఉంటుంది. ఈ క్రమంలో 'నేతన్నల సేవలో' పథకం కింద రెండోవిడత ఆర్థికసాయాన్ని త్వరలో అందజేయనుంది. ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చురుకుగా సాగుతోంది.
అర్హత ఉన్న ప్రతీ చేనేత కుటుంబానికి సంవత్సరానికి 25 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్న ఏపీ సర్కార్, మొదటి విడతలో లబ్ది జరగని అర్హులకు ఈ నెల 3వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో విడతకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36,632 దరఖాస్తులు రావచ్చని మంత్రి సవిత తెలిపారు.

అర్హులైన ప్రతి నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్నవారి ఇళ్లకు నేరుగా వెళ్లి పారదర్శకంగా అర్హులను గుర్తిస్తున్నామని మంత్రి సవిత చెప్పారు. నేతన్నలు నేతన్నల సేవలో పథకం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు.
చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి నేతన్నకు ఆర్థిక మేలు చేకూర్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే నేతన్నలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, త్వరలో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నామని మంత్రి సవిత వెల్లడించారు. చేనేత రంగం సంప్రదాయంతో పాటు జీవనాధారం. అందుకే ప్రభుత్వం వారికి నిరంతరం మద్దతు ఇస్తోంది.
లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత రెండో విడత సాయం నేరుగా ఖాతాల్లోకి జమ అవుతుంది. అర్హులైన చేనేత కార్మికులు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా వేలాది నేత కుటుంబాలకు నేరుగా ఆర్థిక భరోసా లభించనుంది.













Click it and Unblock the Notifications
