నూతన ఆర్ధిక సంవత్సరం తొలినాడే వాహనదారులకు షాక్: టోల్ చార్జీల పెంపు!!
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి నాడే వాహనదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఈనెల ప్రారంభంలోనే వాహనదారులు జేబులకు చిల్లులుపడే కొత్త రూల్ ను అమలులోకి తీసుకువచ్చింది కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలో చార్జీల పెంపును అమలులోకి తీసుకువచ్చింది. గత అర్దరాత్రి నుండి టోల్ ప్లాజాల వద్ద నూతన చార్జీల బాదుడు షురూ అయ్యింది.
గత ఏడాది వివిధ కేటగిరి వాహనాలకు సంబంధించిన టోల్ రేట్లను ఎనిమిది నుండి 15% వరకు పెంచిన జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ ఈసారి టోల్ చార్జీల పెంపును 5.50 శాతానికి పెంచింది. గతంతో పోలిస్తే ఈసారి టోల్ బాదుడు తగ్గించింది.హైదరాబాద్-విజయవాడ.. 65 నంబర్ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు గత అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.

హైదరాబాద్ విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ టోల్ ప్లాజా లలో కార్లు, జీపులు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణం చేయడానికి 5 రూపాయలు, రెండు వైపులా ప్రయాణానికి కలిపి 10 రూపాయలు, తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒక వైపు 10 రూపాయలు, ఇరు వైపులా అయితే 20 రూపాయలు చొప్సున టోల్ పన్ను పెంచారు.
అన్ని రకాల వాహనాలకు 24 గంటల లోపు ప్రయాణం చేస్తే టోల్ చార్జీలను 25% మినహాయింపు లభిస్తుంది. ఇదిలా ఉంటే టోల్ చార్జీలతో పాటు, స్థానికులకు నెలవారి పాస్ చార్జీలను కూడా పెంచారు. 330 రూపాయలుగా ఉన్న దానిని 340 రూపాయలకు పెంచారు. ఇక పెరిగిన టోల్ చార్జీలతో మీద ప్రయాణం చేసే వాహనదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
2025 మార్చి 31వ తేదీ వరకు ఈ పెరిగిన టోల్ ఛార్జీల ధరలు అమలులో ఉంటాయని జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఒక్క టోల్ చార్జీల విషయంలోనే కాదు అనేక రంగాల్లో పలు నిర్ణయాలను ప్రతీ ఆర్ధిక సంవత్సరం కేంద్రం తీసుకుంటుంది.












Click it and Unblock the Notifications