ఏపీతోపాటు తెలంగాణ, కర్ణాటకలో కొత్త కరోనా వేరియంట్: యువతలోనూ ఎక్కువ తీవ్రత, సర్కారు ఇలా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కరోనా వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. బీ.1.617, బీ.1 కోవిడ్ పాజిటివ్ కేసులు ఏపీలో వెలుగుచూశాయి. ఏపీతోపాటు కర్ణాటక, తెలంగాణలోనూ ఈ తీవ్రమైన కరోనా వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ వేరియంట్ యువకుల్లోనూ ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది.

ఏపీ, కర్ణాటక, తెలంగాణలో కొత్త వేరియంట్..
ప్రస్తుతం ఎన్440కే అనేది వేరియంట్ కాదు.. వైరస్ కూడా కాదని ఏపీ ఆరోగ్యశాఖ పేర్కొంది. సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ(సీసీఎంబీ) నివేదికను ఈ సందర్బంగా ప్రస్తావించింది. ఏప్రిల్ నెల పాజిటివ్స్ డేటా ద్వారా దక్షిణ భారతదేశంలోని ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మేజర్ స్ట్రెయిన్స్ గుర్తించినట్లు ఏపీ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్మన్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.

కొత్త వేరియంట్ యువతలోనూ తీవ్రత ఎక్కువే..
బీ.1.617, బీ.1 అనే వేరియంట్లు కరోనా వ్యాప్తిని వేగంగా చేస్తున్నాయని, యువతలోనూ దీని తీవ్రత ఎక్కువగా ఉంటోందని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ జారీ చేసిన వీక్లీ ఎపిడిమాలజికల్ అప్‌డేట్‌లోనూ భారతదేశంలో ఈ బీ.1.617(వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్)ను గుర్తించినట్లు జవహర్ తెలిపారు. అయితే, వేరియంట్ ఎన్440కే గురించి ప్రస్తావించలేదని పేర్కొన్నారు.

ఎన్440కే ఏపీలో చాలా తక్కువ మందిలోనే..
ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో నమూనాలను సేకరించిన సీసీఎంబీ.. జీనోమ్ సీక్వెన్సింగ్ గుర్తించింది. ఏపీ నుంచి ప్రతి నెలా సుమారు 250 నమూనాలను సీసీఎంబీకి పంపడం జరుగుతోంది. జూన్-జులై 2020లో ఎన్440కే స్ట్రెయిన్ కరోనావైరస్(బీ.1.36) గుర్తించినట్లు జవహర్ రెడ్డి తెలిపారు. అయితే, మార్చి 2021 వరకు ఈ స్ట్రెయిన్ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం ఎన్440కే చాలా తక్కువ మంది పాజిటివ్ కేసుల్లోనే వెలుగుచూస్తోందని ఆయన తెలిపారు.
Recommended Video

ఎన్440కే వేరియంట్ అంత తీవ్రమైనదని తేలలేదు..
ఎన్440కే వేరియంట్ చాలా తీవ్రమైనదిగా ఏ డేటా కూడా ఇప్పటి వరకు వెల్లడించలేదని స్పష్టం చేశారు. అంత తీవ్రమైనదైతే డబ్ల్యూహెచ్ఓతోపాటు ఐసీఎంఆర్ రిపోర్టుల్లో కూడా దీని గురించి ప్రస్తావించిఉండేవారని పేర్కొన్నారు. ఎన్440కే వేరియంట్ కారణంగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయని మీడియాలో కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు ఈ మేరకు స్పస్టతనిచ్చింది. కాగా, ఏపీలో గత మూడు రోజులుగా 20వేలకుపైగా కరోనా కేసులు నమోదువుతున్న విషయం తెలిసిందే. మరణాలు కూడా వందకు దగ్గరగా ఉంటున్నాయి.












Click it and Unblock the Notifications