ఎలుకలను ఏరేస్తే... సముద్రంలో 183% పెరిగిన చేపలు!
మనం చేసే ఒక చిన్న మంచి పని ప్రకృతిని ఎంత గొప్పగా తిరిగి నిలబెడుతుందో చెప్పడానికి పసిఫిక్ మహాసముద్రంలోని 'పలావు' దేశం ఒక అద్భుత నిదర్శనంగా నిలిచింది. అక్కడ ఉలోంగ్ అనే ఒక చిన్న ద్వీపంలో పక్షుల గుడ్లు, పిల్లలను తింటూ నాశనం చేస్తున్న నాటు ఎలుకలను అటవీ అధికారులు, పరిశోధకులు పూర్తిగా ఏరిపారేశారు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి అక్కడ ఊహించని విచిత్రం జరిగింది. ద్వీపంలోని చెట్లకే కాకుండా, ఆ చుట్టుపక్కల ఉన్నకోరల్ రీఫ్స్, అరుదైన చేపల జాతులకు మళ్లీ ప్రాణం వచ్చింది. ద్వీపం ఒడ్డున చేపల సంఖ్య ఏకంగా 183 శాతం పెరగడం చూసి శాస్త్రవేత్తలు సైతం విస్తుపోతున్నారు.

పిట్టల రాకతో మారిన పోషకాల బాట
ద్వీపంలో ఎలుకల బెడద వదిలిపోగానే సముద్ర పక్షులు మళ్లీ కొమ్మలపై వాలడం మొదలుపెట్టాయి. కనుమరుగైపోతున్న అరుదైన పక్షి జాతులు మళ్లీ స్వేచ్ఛగా కూయడం ప్రారంభించాయి. పక్షులు సముద్రంలో వేటాడి ఆహారాన్ని తిని, ద్వీపంలోని చెట్లపై మల విసర్జన చేస్తాయి. ఈ పిట్ట రెట్టల్లో నత్రజనితో పాటు శక్తివంతమైన పోషకాలు ఉంటాయి. వర్షం పడినప్పుడు చెట్ల ఆకులపై, నేలపై ఉన్న ఈ పోషకాలన్నీ కొట్టుకుపోయి నేరుగా సముద్ర తీరంలోకి చేరుతున్నాయి. అలా నేల మీది పక్షుల వల్ల సముద్రపు జీవులకు కావాల్సినంత మేత లభించడం ప్రారంభమైంది.
ఏడాదిలోనే సముద్రంలో పెరిగిన విప్లవం
ఎలుకలను తొలగించిన ఉలోంగ్ ద్వీపాన్ని, ఎలుకలు ఉన్న మరో పక్క ద్వీపంతో పోల్చి చూసిన పరిశోధకులు షాకయ్యారు. తీరప్రాంత చెట్ల ఆకుల్లో నత్రజని శాతం 80 శాతం పెరగ్గా, చుట్టుపక్కల నీటిలో చేపల బయోమాస్ ఏకంగా 183 శాతానికి పైగా పెరిగింది. సాధారణంగా భూమిపై చేసే మార్పుల ప్రభావం సముద్రంపై పడటానికి ఏళ్లు పడుతుంది. కానీ ఉలోంగ్ లో కేవలం 12 నెలల్లోనే ఈ స్థాయిలో మార్పు రావడం వాతావరణ శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచింది.
భూమికి-సముద్రానికి ఉన్న బంధానికి నిదర్శనం
వాతావరణంలో ఒక భాగాన్ని బాగుచేస్తే, అది అనుబంధంగా ఉన్న సముద్ర వ్యవస్థను కూడా ఎలా కాపాడుతుందో చెప్పడానికి ఈ ప్రయోగం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. అటు నేలను, ఇటు సముద్ర పర్యావరణాన్ని కలుపుతూ పక్షులు వేస్తున్న ఈ వారధి వల్ల స్థానిక మత్స్యకారుల జీవనోపాధికి కూడా పెద్ద ఊరట లభిస్తోంది. కేవలం ఎలుకల రహిత ద్వీపంగా మార్చడం ద్వారా ఒక పర్యావరణ వ్యవస్థ మళ్లీ ఎలా పూర్వవైభవాన్ని సంతరించుకుందో ఈ ఘట్టం ప్రపంచానికి నిరూపించింది.




Click it and Unblock the Notifications