వైసీపీలోకి రోజా ప్రత్యర్థి - మారుతున్న లెక్కలు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ముఖ్య నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ఈ సమయం లోనే కాంగ్రెస్ లో గతంలో వైఎస్ తో కలిసి పని చేసిన నేతలు వైసీపీలోకి వస్తున్నారు. తన పార్టీ బలోపేతం కోసం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతీ నియోజకవర్గ లెక్కల పైన ఫోకస్ చేసారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ ముఖ్య నేత కుటుంబం నుంచి వైసీపీలోకి చేరికలకు రంగం సిద్దం అవుతోంది.
మారుతున్న లెక్కలు
ఎన్నికల్లో పరాజయంతో వైసీపీ భవిష్యత్ పైన సందేహాలు మొదలయ్యాయి. 11 సీట్లకే పరిమితం కావటంతో ఈ అనుమానాలకు ప్రధాన కారణం. తాజాగా జగన్ వైసీపీ బతుకుంది.. తిరిగి రాష్ట్రాన్ని ఏలుతుంది అని ధీమా వ్యక్తం చేసారు. జిల్లా పర్యటనలకు సిద్దం అవుతున్న జగన్ పార్టీలో చేరిక ల పైన ఫోకస్ చేసారు. కాంగ్రెస్ సీనియర్లు దశల వారీగా వైసీపీలో చేరేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. పార్టీ నుంచి ముఖ్య నేతలు బయటకు వెళ్తున్నా.. తనకు ప్రజల మీదనే నమ్మకం ఉందని జగన్ చెబుతున్నారు. ఇక, ఇప్పుడు ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు.

వైసీపీలో చేరికలు
చిత్తూరు జిల్లా నగరి లో టీడీపీ విజయం సాధించింది. అక్కడ భాను ప్రకాశ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రోజా మంత్రిగా ఉన్న సమయంలో వైసీపీలోని కొందరు ముఖ్యుల మద్దతుతో నియోజకవర్గంలో వైసీపీ నేతలే రోజాకు వ్యతిరేకంగా పని చేసారు. స్వయంగా జగన్ వారికి రోజా గెలుపు కోసం పని చేయాలని సూచించారు. ఇక, ఎన్నికల్లో రోజా ఓడిపోయారు. కొద్ది రోజులుగా రోజా రాజకీయంగా కూటమిని టార్గెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో నగరి ఎమ్మెల్యే భాను ప్రకాశ్ సోదరుడు పార్టీ మార్పు అంశం తెర మీదకు వచ్చింది. గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు మరణం తరువాత ఇద్దరు సోదరుల మధ్య వైరం మొదలైంది. 2019 సీటు ఖరారు సమయంలోనూ ఇద్దరి మధ్య పోటీ కొనసాగింది. సీటు దక్కించుకున్న భాను ప్రకాశ్ 2019లో ఓడిపోగా.. 2024లో గెలుపొందారు.
నగరి కేంద్రంగా
ఇప్పుడు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఎమ్మెల్యే సోదరుడిని వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించారు. ఎమ్మెల్యే సోదరుడు చేరిక ద్వారా రోజా ప్రాధాన్యత తగ్గదని వైసీపీ నేతలు చెబుతున్నారు. రోజాను వ్యతిరేకించిన సొంత పార్టీ నేతలు టీడీపీలోకి వెళ్లారు. దీంతో, రోజా తిరిగి తన పట్టు కొనసాగించే వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సోదరుడు చేరిక ద్వారా నగరిలో ఎలాంటి రాజకీయం చోటు చేసుకుంటుందనే చర్చ వైసీపీ కేడర్ లో కనిపిస్తోంది. అయితే, నియోజకవర్గ ఇంఛార్జ్ గా రోజా కొనసాగుతారని... పార్టీ బలోపేతం కోసం కొన్ని నిర్ణయాలు తప్పవని జిల్లా ముఖ్య నేతలు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఎమ్మెల్యే సోదరుడు చేరిక అంశం పైన అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications