జగన్ సర్కార్ పై NHRC ఆగ్రహం-రఘురామ కేసులో డీజీపీ, హోంసెక్రటరీకి మరోసారి సమన్లు
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకూ మధ్య సాగుతున్న వార్ లో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో తనపై ఏపీ సీఐడీ అధికారులు కస్టడీలో దాడి చేశారని వైసీపీ ఎంపీ రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ రాకపోవడంతో ఇవాళ మరోసారి సమన్లు పంపింది.
ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో దాడి వ్యవహారంలో ఏపీ హోంశాఖ కార్యదర్శికి, డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇవాళ మరోసారి నోటీసులు పంపింది. గతంలో రఘురామరాజు వ్యవహారంపై దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కోరినా పట్టించుకోకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై జాతీయ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక ఎందుకు జాప్యం అవుతుందోనని ఏపీ అధికారులను నిలదీసింది.ఆగస్టు 9 లోపు నివేదిక ఇవ్వాలని తాజాగా ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు ఇచ్చింది.

రఘురామరాజు కేసులో ఏపీ ప్రభుత్వం దర్యాప్తు జరిపి ఆగస్టు 9లోగా నివేదిక ఇవ్వడంలో విఫలమైతే ఆగస్టు 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు పంపింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఈసారి నివేదిక ఇచ్చేందుకు సిద్దమవుతోంది. రఘురామరాజుపై కస్టడీలో దాడి వ్యవహారం సుప్రీంకోర్టు కూడా గతంలో నిర్దారించింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఇరుకునపడింది. సుప్రీంకోర్టు స్పందన తర్వాత కూడా సీఐడీ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.












Click it and Unblock the Notifications