పోటెత్తుతున్న గోదారి: సముద్రంలోకి వెళ్లిన 9 మంది జాలర్లు మృతి
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి తీరం నుంచి చేపటవేటకు వెళ్లిన మత్స్యకారుల్లో మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. జాలర్లలో ఇద్దరు మరణించినట్లు సోమవారం గుర్తించగా, మరో ఏడుగురు మరణించినట్లు మంగళవారం ఉదయం గుర్తించారు.
కాకినాడ పగడాలపేట బోటు సముద్రంలో మునిగిపోయి ప్రమాదం సంభవించింది. మునిగిపోతున్నవారిలో ఒకరిని మరో బోటులోని మత్స్యకారులు రక్షించారు. మత్స్యకారుల మృతిపై డిప్యూటీ సీఎం చినరాజప్ప దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చినరాజప్ప హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 25 పడవలు తీరానికి చేరాయి.

ఇదిలావుంటే, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నదిలో వరదనీటి ఉధృతి పెరుగుతోంది. గోదావరి నీటిమట్టం 9.70 అడుగులకు పెరిగింది. 8 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద ఉన్న సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజి వద్ద నీటిమట్టం 7.9 అడుగులుగా సోమవారంనాడు నమోదయి, ఆరు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదలవుతోంది.
ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతం నుండి వరద వచ్చి చేరుతుండటంతో ధవళేశ్వరం వద్ద నీటిమట్టం ఉదయం 9గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు 7.9అడుగులు వద్ద నిలకడగా ఉంది. కాళేశ్వరం, భద్రాచలం నుండి నీరు ధవళేశ్వరం చేరుకునే సరికి, ఇక్కడ ఉన్న నీరు సముద్రంలోకి వెళుతుంది. అందువల్ల మంగళవారం నాటికి ధవళేశ్వరం వద్ద నీటిమట్టం స్వల్పంగా పెరిగి 7లక్షల క్యూసెక్కులకు చేరుకున్నప్పటికీ, తరువాత తగ్గుముఖం పడుతుందని జలవనరులశాఖ అధికారులు అంచనావేస్తున్నారు.
బాలుడి మృతి
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మూడేళ్ల బాలుడు వర్షపునీటిలో పడి మరణించాడు. మచిలీపట్నంలో లోతట్టు ప్రాంతమైన కరెంట్ కాలనీకి చెందిన వేముల రాజ్‌కుమార్ - నాగదేవి దంపతుల కుమారుడైన భాగ్యసాయి లక్ష్మీ నరసింహం(3) సోమవారం ఉదయం 10గంటల వరకు ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆడుకున్నాడు. 10గంటల తర్వాత నరసింహం కనిపించకపోవటంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెతకగా, మధ్యాహ్నం 2గంటల సమయంలో నిల్వ ఉన్న వర్షపునీటిలో పడి ఉండటాన్ని గుర్తించారు.












Click it and Unblock the Notifications