FIFA World Cup: పగ తీర్చుకున్న మెక్సికో! ఒకే మ్యాచ్‌లో 3 రెడ్ కార్డులు
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మహా సంగ్రామం.. 'ఫిఫా వరల్డ్ కప్' (FIFA World Cup 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. చరిత్రలోనే అత్యంత భారీగా 48 జట్లతో అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో.. తొలి రోజే అసలైన ఫుట్‌బాల్ మజా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది.
మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక 'ఎస్టాడియో అజ్టెకా' మైదానంలో హోరాహోరీగా సాగిన ప్రారంభ పోరులో సహ-ఆతిథ్య దేశం మెక్సికో 2-0 తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి టోర్నీని విజయంతో ప్రారంభించింది. అయితే, ఈ మ్యాచ్ కేవలం గోల్స్‌తోనే కాదు.. వరల్డ్ కప్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే మ్యాచ్‌లో ఏకంగా మూడు రెడ్ కార్డుల సంచలనంతో ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోయింది.
అజ్టెకా మైదానంలో రికార్డుల వేట.. 9వ నిమిషంలోనే గోల్!
రెండుసార్లు ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చి, ఇప్పుడు మూడోసారి వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వేదికగా మారిన మొదటి స్టేడియంగా 'ఎస్టాడియో అజ్టెకా' సరికొత్త చరిత్ర సృష్టించింది. 80 వేల మందికి పైగా అభిమానులు 'మెక్సికో గ్రీన్' జెర్సీలతో నిండిపోయిన వేళ.. మ్యాచ్ ప్రారంభమైన కేవలం 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ సూపర్ గోల్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. సౌదీ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న క్వినోనెస్ కొట్టిన ఈ గోల్.. గత 20 ఏళ్ల వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌ల చరిత్రలోనే అత్యంత వేగవంతమైన గోల్‌గా రికార్డు సృష్టించింది.

ఒకే మ్యాచ్.. మూడు రెడ్ కార్డులు.. గ్రౌండ్‌లో హై టెన్షన్!
ఈ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందంటే.. ఆటగాళ్ల మధ్య ఆవేశం కట్టలు తెంచుకుంది. వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక ఓపెనింగ్ మ్యాచ్‌లో అత్యధికంగా 3 రెడ్ కార్డులు నమోదయ్యాయి. సెకండ్ హాఫ్‌లో సౌత్ ఆఫ్రికా మిడ్‌ఫీల్డర్ యా యా సిథోల్ ఘోరమైన ఫౌల్ చేయడంతో అంపైర్ నేరుగా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సౌత్ ఆఫ్రికాకే చెందిన థెంబ్వా జ్వానే.. మెక్సికో ఆటగాడి ముఖంపై కొట్టడంతో వీఏఆర్ (VAR) రివ్యూ ద్వారా రెండో రెడ్ కార్డ్ ఎదుర్కొన్నాడు. మ్యాచ్ దాదాపు ముగుస్తుందనగా ఇంజూరీ టైమ్‌లో మెక్సికో ఆటగాడు సీజర్ మోంటెస్ కూడా రెడ్ కార్డ్ లైన్ దాటడంతో మైదానంలో టెన్షన్ పీక్స్‌కు చేరింది.
చరిత్ర సృష్టించిన యువ సంచలనం.. రేసులోకి జిమెనెజ్!
సౌత్ ఆఫ్రికా డిఫెన్స్‌ను ముక్కలు చేస్తూ మెక్సికో వెటరన్ స్ట్రైకర్ రౌల్ జిమెనెజ్ సెకండ్ హాఫ్‌లో హెడర్ ద్వారా అద్భుతమైన రెండో గోల్ చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ గోల్‌తో మెక్సికో తరఫున అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా రౌల్ నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో మెక్సికో మరో అద్భుతానికి తెరతీసింది. కేవలం 17 సంవత్సరాల 240 రోజుల వయసున్న గిల్బెర్టో మోరాను రంగంలోకి దించి.. వరల్డ్ కప్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన మెక్సికన్ ఆటగాడిగా రికార్డు సృష్టించింది. గత 2022 వరల్డ్ కప్‌లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించిన మెక్సికో, ఈసారి లీగ్‌ను విక్టరీతో ప్రారంభించి 3 పాయింట్లతో గ్రూప్-ఎ లో దూసుకుపోతోంది.
షకీరా 'దై దై' సాంగ్.. సల్మా హాయెక్ సర్‌ప్రైజ్!
మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన ఓపెనింగ్ సెర్మనీ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసింది. గ్లోబల్ పాప్ సింగర్ షకీరా ఈ టోర్నమెంట్ అధికారిక సాంగ్ "దై దై" (Dai Dai) పాడుతూ స్టేడియాన్ని డాన్స్ స్టెప్పులతో ఊపేసింది. షకీరాతో పాటు ఆండ్రియా బోసెల్లి, బర్నా బాయ్ తమ ప్రదర్శనలతో అదరగొట్టగా.. హాలీవుడ్ స్టార్ నటి సల్మా హాయెక్ సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. మెక్సికన్, ఇంగ్లీష్, స్థానిక తెగల భాషల్లో సాగిన ఈ వేడుకలు కళ్లు చెదిరేలా సాగాయి. మెక్సికో తన తదుపరి మ్యాచ్‌ను జూన్ 18న సౌత్ కొరియాతో ఆడనుంది.














Click it and Unblock the Notifications