ఏపీకి ఏదైనా చేయాలనుంది, అన్ని జిల్లాలో పర్యటిస్తాం: నిర్మల
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగా ఉన్న తనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా చేయాలని ఉందని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హోదాతో సమానమైన సాయాన్ని కేంద్రం అందిస్తోందని అన్నారు.
రాజకీయ కారణాలతోనే హోదాపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించిన నిర్మల, కేంద్ర మంత్రులంతా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలకు నిజానిజాలను వివరించి చెబుతామని అన్నారు.
తనవంతుగా ఏపీలో పారిశ్రామిక కారిడార్ ను మరింత అభివృద్ధి చేసేందుకు, తద్వారా వాణిజ్యం పెరిగేందుకు కృషి చేస్తానని అన్నారు. దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు.

విమర్శలను తిప్పికొట్టండి: వెంకయ్యకు కృతజ్ఞతలు
ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో ఆంధప్రదేశ్‌కు చెందిన బిజెపి నేతలు శుక్రవారం ఉదయం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఏపీకి ప్రకటించిన ప్యాకేజీపై వెంకయ్యకు బిజెపి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రత్యేక రైల్వే జోన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎందుకు చట్టంలో పొందుపరచలేదని ప్రశ్నించారు. కేంద్ర సహకారం ఎంతో అవసరం.. కేంద్రం సాయం లేకుండా ఆంధ్రప్రదేశ్ కోలుకోలేదు. పరస్పర సహకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచిదనే విషయం గుర్తించాలని సూచించారు. ఏపీకి అన్ని రకాల ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌పై ప్రధాని మోడీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని స్పష్టం చేశారు. విభజన చట్టంలో 10 ఏళ్లలో విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని ఉంది, కానీ రెండున్నరేళ్లలోనే అన్ని విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్రంపై వస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని బిజెపి నేతలకు సూచించారు. కేంద్రం అమలు చేసిన హామీలను ప్రజలకు వివరించాలని నేతలకు వెంకయ్య సూచించారు.












Click it and Unblock the Notifications