కొత్తగా చెప్పేది లేదు, సోనియాను కలిసినా అదే!: కిరణ్
హైదరాబాద్: తాను ఢిల్లీకి వచ్చినా కొత్తగా చెప్పేది ఏమీ ఉండదని, ఎవరిని కలిసినా తాను అదే మాట చెబుతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. మంగళవారం డిగ్గీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఢిల్లీ రావాల్సిందిగా చెప్పిన విషయం తెలిసిందే. డిగ్గీ మాత్రమే కాకుండా ఇటీవల పలువురు నేతలు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు.
సమైక్యవాదానికే తాను కట్టుబడి ఉన్నానని, మరో వాదానికి తావు లేదని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సహా ఎవరిని కలిసినా ఇదే వాదనను స్పష్టంగా వినిపిస్తానని ముఖ్యమంత్రి వారికి చెప్పారట. ఈ సందర్భంగా వారు విభజనపై అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, త్వరలోనే పార్టీ అధ్యక్షురాలు సోనియాతో సహా మరికొందరిని కలిసి మాట్లాడాలని ముఖ్యమంత్రికి సూచించారట.

కిరణ్ మాత్రం వారితో తాను సమైక్యానికే కట్టుబడి ఉన్నానని, ఇలాంటి తరుణంలో మరోమాటకు తావు లేదని, సోనియా గాంధీ అంటే తనకు అపారమైన గౌరవమని, ఆమె కోరినప్పుడు ఏదైనా అజెండా అంశాలను సూచించినప్పుడు తాను తప్పక ఢిల్లీకి వస్తానని, అప్పుడు కూడా తన వాదనలో ఎలాంటి మార్పు ఉండబోదని వారికి స్పష్టం చేశారట.
కాగా, ఇటీవల ఎపిఎన్జీవోలతో చర్చలు జరిపినప్పుడు రెండుసార్లు అసెంబ్లీ తీర్మానం వస్తుందని ఉద్యోగులకు చెప్పాలని డిగ్గీ ముఖ్యమంత్రికి సూచించిన విషయం తెలిసిందే. కిరణ్ వారితో అదే చెప్పారు. అయితే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తీర్మానంపై భిన్నంగా మాట్లాడటంతో ముఖ్యమంత్రి డిగ్గీకి ఫోన్ చేసి ప్రశ్నించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications