చంద్రబాబు సంతకం అమలుకు జగన్, బీజేపీ గండం - గట్టెక్కేనా..!!
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బాధ్యతలు చేపడుతూనే అయిదు సంతకాలు చేసారు. అందులో ఎన్నికల సమయంలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్ టైటిల్ యాక్ట్. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టం రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే రద్దుకు వీలుగా సంతకం చేసారు. అయితే, ఈ సంతకం అమలయ్యేనా. వైసీపీ..బీజేపీ ఈ సందేహానికి కారణంగా మారుతున్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే చంద్రాబుకు ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి.
చంద్రబాబు సంతకం
వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూయాజమాన్య హక్కు చట్టం- 2023 (ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్) రద్దుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేసారు. అయితే, ఆ సంతకం ఇప్పుడప్పుడే చెల్లు బాటవుతుందా లేదా అనే చర్చ మొదలైంది. ఈ యాక్ట్ రద్దుకు చాలా సమయం పడుతుందని, అంత సులువు కూడా కాదని, రాజ్యాంగ, న్యాయపరమైన పలు అంశాలు ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు. ఈ సంతకం అమలు కావాలంటే..అది కేబినెట్‌కు వెళ్లాలి. తక్షణం యాక్ట్ రద్దు కావాలంటే ఆర్డినెన్స్ జారీ చేయాలి. అది గవర్నర్ ఆమోదం పొందాక రాజ్యాం గంలోని 254(2) అధికరణ మేరకు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లాలి. రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం లభించాకనే చట్టం అయింది. కనుక ఇప్పుడు రద్దు ఆర్డినెన్స్ కూడా ఆ విధంగానే రాష్ట్రపతికి వెళ్లి అక్కడి నుంచి ఆమోదం వస్తేనే రద్దు అవుతుంది.

మండలిలో వైసీపీ మెజార్టీ
ఆర్డినెన్స్ కాబట్టి దాని కాలపరిమితి ఆరు మాసాలే ఉంటుంది. ఆ లోపు ఆర్డినెన్స్‌ను బిల్లు రూపంలో ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకొని, రాష్ట్రపతికి పంపాలి. రాష్ట్రపతి ఆమోదంతోనే పూర్తిగా చట్టం రద్దు అవుతుంది. త్వరలో కొత్త ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. కాబట్టి ఆర్డినెన్స్‌కు బదులు నేరుగా ఉభయ సభల్లో బిల్లు పెట్టి ఆమోదం తీసుకొని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపితే అక్కడి నుంచి ఆమోదం తీసుకుంటే సరి పోతుంది. ఇక్కడే ప్రభుత్వానికి పెద్ద సమస్య ఉంది. శాసనసభలో కూటమికి మెజార్టీ ఉంది కనుక అక్కడ సునాయాసంగా రద్దు బిల్లు ఆమోదం పొందుతుంది. శానసమండలిలో ప్రస్తుతం వైసిపికి మెజార్టీ ఉంది. 58 మంది సభ్యులున్న మండలిలో ఆరు ఖాళీ అయ్యాయి. 41 మంది వైసిపి ఎంఎల్‌సిలు ఉన్నారు. వారిలో అధికారికంగా 30 మంది, నామినేటెడ్ 8 మంది, ముగ్గురు ఉన్నారు.
బీజేపీ నిర్ణయం ఏంటి
సీట్ల లెక్కల ప్రకారం చూస్తే మండలిలో రద్దు బిల్లు ఆమోదం పొందే పరిస్థితి లేదు. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు పెడితే మండలిలో ఏ విధంగా అయితే అప్పుడు మెజార్టీ ఉన్న టిడిపి అడ్డుకుందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లును వైసిపి అడ్డుకొనే అవకాశం ఉంది. నీతిఆయోగ్ సూచనల మేరకు వైసిపి సర్కారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చానంటోంది. ఇప్పుడు ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ అభిప్రాయం స్పష్టం కావాల్సి ఉంది. ఇక..ల్యాండ్ టైట్లింగ్ చట్టం అంశం హైకోర్టులో ఉంది. అక్కడ క్లియర్ అయ్యే వరకు ప్రభుత్వం చేపట్టిన రద్దు ప్రక్రియ ముందుకు సాగడానికి వీలుండదని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో..ఈ సంతకం అమలులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications