పొగిడినా పేర్నిని వదలని చంద్రబాబు- బిగ్ షాక్..!
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి పేర్నినానికి భారీ షాక్ తగిలింది. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పేర్ని నాని భార్య జయసుధకు నిన్న కృష్ణాజిల్లా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
అంతలోపే పోలీసులు పేర్ని నానిని ఇదే కేసులో ఏ6గా చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు తన భార్య అరెస్టు కాకుండా అడ్డుకున్న చంద్రబాబుపై పేర్నినాని పొగడ్తలు కురిపించారు. అయినా పేర్నికి రేషన్ బియ్యం కేసులో ఊరట దక్కలేదు.

వైసీపీ హయాంలో పేర్ని నాని మంత్రిగా ఉండగా బందరులో ఆయన భార్య జయసుధ పేరుతో ఉన్న గోడౌన్ లో పౌరసరఫరాలశాఖ అధికారులు రేషన్ బియ్యం నిల్వ చేశారు. అయితే తాజాగా అందులో చాలా వరకూ మాయం అయినట్లు ఆరోపణలు రావడంతో పౌరసరఫరాలశాఖతో పాటు పోలీసు శాఖ కూడా దృష్టిసారించింది. ఇదే క్రమంలో గోడౌన్ ఓనర్ అయిన పేర్ని జయసుధను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం అయినట్లు ప్రచారం కూడా జరిగింది.
ఇదే సమయంలో పేర్నినాని, జయసుధ, వీరి కుమారుడు కిట్టు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఉన్నట్లుండి ప్రత్యక్షమైన పేర్నినాని తమ గోడౌన్ లో మాయమైన బియ్యానికి పరిహారం డీడీల రూపంలో చెల్లించామని, అయినా పోలీసు విచారణ కంటే ముందు తమను దోషులుగా చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతే కాదు ఈ కేసులో తన భార్య జయసుధ అరెస్టుకు ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నించినా సీఎం చంద్రబాబు మాత్రం ఒప్పుకోలేదన్నారు.
దీంతో చంద్రబాబును పొగిడిన పేర్ని కుటుంబానికి ఈ కేసులో ఊరట దక్కుతుందేమోనని అంతా అనుకున్నారు. కానీ నిన్న ఒక్కరోజే రేషన్ బియ్యం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారితో పాటు వీరి గోడౌన్ మేనేజర్, రైస్ మిల్లు యజమాని, లారీ డ్రైవర్ ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు పంపారు. అదే సమయంలో సాయంత్రం కృష్ణాజిల్లా కోర్టు జయసుధకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. దీని తర్వాత పేర్నినానిని ఈ కేసులో ఏ6గా చేర్చారు. దీంతో పేర్ని అరెస్టు తప్పదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications