నో యూజ్: హోదాపై మరోసారి తేల్చేసిన వెంకయ్య, తెరాసపై పరోక్ష వ్యాఖ్య
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయాన్ని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు మరోసారి తేల్చేశారు. ఆయన మాటలను బట్టి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే విషయం అర్థమవుతోంది.ఏపీకి ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం ఉండదని, ఏపీకి కేంద్రం ప్రత్యేక గుర్తింపు ఇస్తోందని ఆయన చెప్పారు.
18 నెలల్లో ఏపీకి ఎంతో సాయం చేశామని ఆయన శనివారంనాడు మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత తూలనాడిన వారే ఆంధ్రావాళ్లని మంచివాళ్లని అంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు చేస్తున్న ప్రకటనలపై ఆయన వ్యాఖ్య చేసినట్లు కనిపిస్తున్నారు.

త్వరలో రియల్ ఎస్టేట్ బిల్లు తెస్తామని ఆయన వెల్లడించారు. రియల్ ప్లాన్లకు 30 రోజుల్లో అనుమతి ఇచ్చి తీరాల్సిందేని చెప్పారు. ఇవ్వకపోతే ఇచ్చినట్టుగా భావించేలా చట్టం తెస్తున్నామని వెల్లడించారు. బహుళ అంతస్తుల భవనాలకు ఎయిర్‌పోర్స్, డిఫెన్స్, పర్యావరణ అనుమతులకు ఢిల్లీకి రావాల్సిన పని లేదని వెంకయ్య అన్నారు.
కేంద్రం పంపించే మార్గదర్శక సూత్రాలను పాటిస్తే మున్సిపాలిటీలే అనుమతులిస్తాయని చెప్పారు. బిల్డర్లు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అవినీతికి పాల్పడిన వారిని బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదిలావుంటే, ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం నగరంలో జరిగిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెట్టుబడులకు భారత్ సురక్షితమైన దేశమని వెంకయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications