రూ.40 కోట్లు కాదు 1.49 కోట్లు, మజ్జిగ సప్లైపై హెరిటేజ్, పారదర్శకంగా జరిగాయని వివరణ..
గత ప్రభుత్వ హయాంలో హెరిటేజ్ సంస్థకు ప్రాధాన్యం ఇచ్చారని, ఆ కంపెనీ ఉత్పత్తులకు ప్రయారిటీ ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ క్రమంలో గతంలో జరిగిన కేటాయింపుల గురించి హెరిటేజ్ కంపెనీ వివరణ ఇచ్చింది. ఆన్ లైన్ టెండర్లలో పాల్గొని.. నిష్పాక్షిపాతంగా దక్కించుకున్నామని తెలిపింది. ఇందులో ఎలాంటి అవకతవకలకు చోటు లేదని తేల్చిచెప్పింది. కానీ రాజకీయం కోసం తమ సంస్థపై అభాండాలు వేయడం సరికాదని హితవు పలికింది.

ఇలా జరిగింది..
హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు రావడంతో లక్షలాది మంది రైతులు ఆందోళనకు చెందుతున్నారని.. అందుకే మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయం తెలియజేస్తున్నామని పేర్కొన్నది. గత ప్రభుత్వ హయాంలో రూ.40 కోట్ల విలువైన మజ్జిగను హెరిటేజ్ ప్రభుత్వానికి సరఫరా చేయలేదని తేల్చిచెప్పింది. కేవలం 1.49 కోట్ల మజ్జిగను మాత్రమే సప్లై చేశామని పేర్కొన్నది. 2015-16 నుంచి 2019-20 మధ్య మాత్రమే సరఫరా చేశామని తెలిపింది. కానీ కొందరు నిందలు వేయడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడింది.

ఓకే ధరకు ఆర్డర్
శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి.. పండగ సమయాల్లో ఇతర కంపెనీలతో ఓకే ధరకు ఆర్డర్ పంచుకున్నామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ నిర్వహించిన టెండర్లలో నిబంధనల మేరకు ఆర్డర్ జరిగాయని.. మొత్తం ఆర్డర్ హెరిటేజ్ సంస్థకు ఇవ్వలేదు అని స్పష్టంచేసింది. టెండర్ ప్రక్రియలో పాల్గొని ఉత్పత్తులను ప్రదానం చేశామని వివరించింది.

రూ.21.19 కోట్లు
2014-15 నుంచి 2016-17 వరకు నెయ్యి సరఫరా మొత్తం తమ సంస్థకు రూ.21.19 కోట్ల ఆర్డర్ వచ్చిందని తెలిపింది. తమ భాగస్వామ్య కంపెనీలతో పంపిణీ చేశామని పేర్కొన్నది. మజ్జిగ, నెయ్యి ఇతర ఉత్పత్తుల టెండర్ల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని వివరించింది. టెండర్లలో పాల్గొని పంపిణీ చేసే అవకాశం దక్కించుకున్నామని.. దీంతో ఉత్పత్తిని మార్కెటింగ్ చేసినందుకు కంపెనీపై ఆధారపడ్డ రైతులకు మేలు జరిగిందని తెలిపింది. కానీ కొందరు సంస్థపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికింది.












Click it and Unblock the Notifications