రెండో పెళ్లి, రాకేష్‌తో డేటింగ్, చెక్ పవర్: జయరాం మర్డర్ మిస్టరీపై శిఖాచౌదరి సంచలన విషయాలు!
అమరావతి: ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రాకేష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. చిల్లకల్లు రామ్ కో సిమెంట్ కంపెనీకి చెందిన గెస్ట్ హౌస్‌లో విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. విచారణ అనంతరం పోలీసులు కేసు వివరాలను వెల్లడించనున్నారు.
ఈ సందర్భంగా పోలీసుల ఎదుట శిఖా చౌదరి (జయరాం కోడలు) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. తన పెళ్లిళ్ల గురించి, తన మామయ్య గురించి, రాకేష్ రెడ్డి గురించి పూసగుచ్చినట్లుగా చెప్పిందని తెలుస్తోంది. అలాగే, తన మామయ్య జయరాం ఎందుకు అప్పులు చేశాడనే విషయాన్ని కూడా వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మీడియాలో వస్తున్న సమాచారం మేరకు...

రెండు పెళ్లిళ్లు.. రాకేష్ రెడ్డితో డేటింగ్
తనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని, వారిద్దరితోను విడాకులు తీసుకున్నానని శిఖాచౌదరి పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. తాను తన రెండో భర్తను వదిలేయడానికి రాకేష్ రెడ్డి కారణమని చెప్పింది. రాకేష్ రెడ్డితో తాను డేటింగ్ చేసినట్లుగా చెప్పింది. రెండో భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత రాకేష్ రెడ్డిని పెళ్లి చేసుకుందామని అనుకున్నట్లు చెప్పింది.

తన మామయ్య వల్ల రాకేష్ రెడ్డికి దూరమయ్యా.. చెక్ పవర్ అత్తయ్య చేతిలో
తాను తన మామయ్య జయరాం కారణంగానే రాకేష్ రెడ్డికి దూరం కావాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. తన మామయ్యకు రాకేష్‌ను తానే పరిచయం చేసినట్లు తెలిపింది. రాకేష్ రెడ్డికి సొంత వ్యాపారాలు ఏమీ లేవని చెప్పింది. పెద్దపెద్ద వారి వద్ద బ్రోకరింగ్ చేస్తు డబ్బు సంపాదించేవాడని చెప్పింది. తన మామయ్య జయరాంకు రాకేష్ రూ.4.5 కోట్లు అప్పుగా ఇచ్చాడని చెప్పింది. చెక్ పవర్ అత్తయ్య చేతిలో ఉండటం వల్ల తన మామయ్య జయరాం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. అందుకే చాలామంది దగ్గర జయరాం అప్పులు చేసినట్లు చెప్పింది. హత్యకు జయరాం, రాకేష్ మధ్య ఆర్థిక లావాదేవీలే కారణమని చెప్పినట్లుగా తెలుస్తోంది.

జయరాం హత్యతో సంబంధం లేదు
రాకేష్ రెడ్డి ఇచ్చిన రూ.4.5 కోట్ల డబ్బును తన మామయ్య ఆయనకు సకాలంలో ఇవ్వలేదని ఆమె వెల్లడించింది. ఆ డబ్బులు కూడా అతనివి కావని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో రాకేష్‌కు, తనకు తరుచూ గొడవలు అయ్యేవని చెప్పింది. మామయ్య జయరాం పైన రాకేష్ కోపం పెంచుకున్నట్లు చెప్పింది. జయరాం హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. రాకేష్ రెడ్డి తన మామయ్యను చంపుతాడని ఊహించలేదని, పోలీసుల విచారణకు సహకరిస్తానని తెలిపింది.

పోలీసులు రమ్మంటే వెళ్లా
హత్య జరిగిన రోజు తాను శ్రీకాంత్‌తో వికారాబాద్‌కు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లానని ఆమె చెప్పింది. రాకేష్‌తో గొడవల నేపథ్యంలో శ్రీకాంత్ పరిచయమయ్యాడని చెప్పింది. తనకు ఉదయం ఆరు గంటలకు తన తల్లి ఫోన్ చేసి మామయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం చెప్పిందని తెలిపింది. ఆ సమయంలో తాను, శ్రీకాంత్ కలిసి మామయ్య ఇంటికి వెళ్లామని చెప్పింది. జగ్గయ్యపేటలో తనకు రాసిచ్చిన పది ఎకరాల భూమి పత్రాల కోసం వెతికినట్లు తెలిపింది. ఆ తర్వాత మామయ్యను చూసేందుకు బెజవాడ వెళ్లినట్లు తెలిపింది. అదే సమయంలో విజయవాడ పోలీసులు తనను రమ్మని ఫోన్ చేస్తే అక్కడకు వెళ్లినట్లు తెలిపింది.

హత్యపై కేపీ చౌదరి ఏమన్నారంటే?
జయరాం హత్య కేసుపై కబాలి తెలుగు సినిమా నిర్మాత కేపీ చౌదరి మాట్లాడుతూ... శిఖ చౌదరి తనను అన్నయ్య అని పిలుస్తుందని చెప్పారు. తన బీఎండబ్ల్యూ కారులో శిఖా చౌదరిను తాను నిన్న పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చానని చెప్పారు. అందుకే ఆ కారును తాను సాయంత్రం వచ్చి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. జయరాం హత్య కేసులో శిఖా చౌదరికి ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. అసలు ఆయనను హత్య చేయాల్సిన అవసరం ఆమెకు లేదని తేల్చి చెప్పారు. జయరాంకు, శిఖాచౌదరికి మధ్య ఎంతో ప్రేమానుబంధం ఉందని చెప్పారు. శిఖాచౌదరి ప్రియుడిగా భావిస్తున్న రాకేష్ రెడ్డి గురించి స్పందిస్తూ... అసలు ఆయన ఎవరో తనకు తెలియదన్నారు.












Click it and Unblock the Notifications