జగన్ భవిష్యత్ ప్రధాని! మీసం తీసేసి రాజీనామా ! వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్..
ఏపీలో విపక్ష నేత చంద్రబాబు కృష్ణాజిల్లా టూర్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుపై చంద్రబాబు కామెంట్స్ చిచ్చు రేపాయి. ఎమ్మెల్యే అప్పారావు అక్రమాలపై చంద్రబాబు చేసిన విమర్శలకు ఆయన ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు.అదే సమయంలో జగన్ పైనా ప్రశంసలు కురిపించారు.
నిన్న తన నియోజకవర్గంలో పర్యటిస్తూ చంద్రబాబు తనపై చేసిన విమర్శలపై ఎమ్మెల్యే మేకా వెంకట అప్పారావు స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన ఛాలెంజ్ చేశారు. నూజివీడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూములు ఆక్రమించి ఇసుక అక్రమంగా అమ్ముకుంటున్నారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్యే మేకా..తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే మీసం తీసేసి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు.

నూజివీడు పట్టణంలో ఏ సెంటర్ అయినా ఎక్కడికైనా వస్తానని, తనపై చేసిన ఆరోపణలు నువ్వు కానీ నీ నియోజకవర్గ ఇన్చార్జ్ గాని నిరూపిస్తారా అంటూ ఎమ్మెల్యే చంద్రబాబును ప్రశ్నించారు. మరోవైపు సీఎం జగన్ ముఖ్యమంత్రి పదవి నుండి ప్రధానమంత్రి స్థాయికి వెళతారనీ మేకా ప్రతాప్ జోస్యం చెప్పారు. జగన్ పాలనలో జనం సంతోషంగా ఉన్నారన్నారు. తన నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదన్నారు.













Click it and Unblock the Notifications