ఆ 28 మంది ఎక్కడ - రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్..!!
ఒడిశారైలు ప్రమాదంలో ఏపీ వాసులను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంలో దాదాపుగా 290 మంది మరణించారు. 800 మంది వరకు గాయాల పాలయ్యారు. వీరంతా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏపీ నుంచి ప్రమాదానికి గురైన రెండు రైళ్లల్లో తెలుగు ప్రయాణీకులు ఉన్నారు. వీరిలో ఒకరు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ 10 లక్షల సాయం ప్రకటించింది.
ఏపీ ప్రయాణీకుడు మృతి: ఏపీలో శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి బాలాసోర్ లో నివాసం ఉంటున్నారు. పెన్షన్ తీసుకొని వెళ్తుండగా ఆయన రైలు ప్రమాదంలో మరణించారు. ఈ రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన 695 మందిని గుర్తించారు. అందులో 553 మంది సురక్షితంగా ఉన్నట్లు మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రకటించారు.

కోరమండల్ లో ఏపీకి చెందిన 480 మంది, యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ లో 211 మంది ప్రయాణించినట్లు వెల్లడించారు. 22 మంది గాయపడ్డారని వివరించారు. 92 మంది ప్రయాణం చేయలేదని నిర్ధారణ అయినట్లు చెప్పుకొచ్చారు. గాయపడిన వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. విశాఖలో అయిదుగురికి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి బొత్సా వెల్లడించారు.
సీఎం జగన్ ఎక్స్ గ్రేషియా ప్రకటన: స్వల్ప గాయాలైన 11 మందికి చికిత్స అందించి పంపించామని వివరించారు. మిగిలిన 28 మంది ఫోన్ లోకి అందుబాటులోకి రాలేదన్నారు. జనరల్ బోగీల్లో ఎవరైనా ప్రయాణం చేసారా అనే కోణంలో సమాచారం తెలుసుకొనేందుకు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
రైలు ప్రమాదంలో మృతిచెందిన గురుమూర్తి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయానికి అదనంగా ఇది ఇవ్వాలని సీఎం స్పష్టంచేశారు.
28 మంది ఆచూకీ కోసం: మంత్రి అమర్‌నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమావేశం ఆదివారం ఉదయం బాలాసోర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ.. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరులో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో తమ వారు కనిపించడం లేదని ఇప్పటివరకు ఎవరూ రాలేదని, ఇప్పటికీ తమ వారి ఆచూకీ లభ్యం కానివారు 83339 05022 వాట్సాప్‌కు వారి ఫొటోలు పంపిస్తే అధికారులు వారి వివరాలు సేకరిస్తారని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఏపీ ప్రాంతాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. స్వస్థలాలకు చేరుకొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications