Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఫేక్ ప్రచారం..! అరెస్టు, రిమాండ్..!
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. హైదరాబాద్ నుంచి గత వారం ఏపీకి బయలుదేరి మార్గమధ్యలో పలు చోట్ల ఆగి చివరికి రాజమండ్రి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని పోలీసులు అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆయన మృతి చెందిన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో అంతకు ముందు ఏం జరిగిందనే దానిపై ప్రతీ రోజూ పుకార్లు పెరిగిపోతున్నాయి.
పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రికి వచ్చేలోపు ఏం జరిగిందన్న దానిపై రోజుకో కొత్త కథనం పుట్టుకొస్తోంది. దీంతో జనం కూడా ఆయన మృతిపై సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా ప్రచారాలు చేయడం ప్రారంభించారు. దీంతో అత్యంత సున్నితమైన ఈ వ్యవహారం కాస్తా రోజురోజుకూ వివాదాస్పదంగా మారిపోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పోలీసులు చెప్పినట్లుగానే కొరడా ఝళిపించడం ప్రారంభించారు.

రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. రాజమండ్రి లలితా నగర్ ప్రాంత వాసి దేవబత్తుల నాగమల్లేష్ ని అరెస్ట్ చేసి పోలీసులు కోర్ట్ లో ప్రవేశ పెట్టారు. స్థానిక విఆర్ఓ పిర్యాదు మేరకు సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్న మల్లేష్ ని అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి మూడవ పట్టణ పోలీసులు తెలిపారు. కోర్టులో ప్రవేశ పెట్టిన మల్లేష్ కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో ఇలా తప్పుడు ప్రచారాలు చేసే వారికి పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ పంపారు.












Click it and Unblock the Notifications