సింహాచలం ఘటన: కోటి పరిహారం డిమాండ్, హోంమంత్రి వంగలపూడి అనిత ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడకూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనతో పలువురి కుటుంబాలలో విషాదం చోటుచేసుకుంది. సింహాచలంలో భారీ వర్షం కురవడంతో బస్టాండు నుండి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పైన గోడకూలి పడిన ఘటనలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన హోం మంత్రి అనిత
ఈ దుర్ఘటన మృతుల్లో విశాఖ నగరానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. మరొకరు విశాఖ జిల్లా అడవివరంకు చెందినవారు కాగా, ఇద్దరు తూర్పు గోదావరి జిల్లా మాచవరానికి చెందిన వారు. ప్రస్తుతం వీరి మృతదేహాలకు పోస్ట్ మార్టం జరుగుతుంది. ప్రస్తుతం కేజీహెచ్ ఆస్పత్రి వద్ద బాధితుల రోదనలు మిన్ను ముడుతున్నాయి. ఇక కేజీహెచ్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాలను హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు.

కోటి రూపాయల పరిహారం కోసం మృతుల కుటుంబాల డిమాండ్
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వంగలపూడి అనిత బాధిత కుటుంబాలు కోటి రూపాయల నష్టపరిహారం అడుగుతున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా జిల్లాలలోని ఎమ్మెల్యేలందరూ బాధ్యత తీసుకుంటామని వంగలపూడి అనిత తెలిపారు.
ప్రభుత్వ పరిహారం గురించి చెప్పిన వంగలపూడి అనిత
మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 25 లక్షల రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిందని వంగలపూడి అనిత పేర్కొన్నారు. అంతేకాకుండా పిల్లలను ప్రభుత్వపరంగా చదివిస్తామని కూడా ఆమె తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బాధిత కుటుంబాలకు అప్పగిస్తామని పేర్కొన్నారు.
నివేదిక ఇవ్వాలని ఆదేశం.. వారిపై క్రిమినల్ కేసులు
సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలిన ఘటన పైన దర్యాప్తు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసిందని, 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని హోం మంత్రి తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత, నిర్లక్ష్యం వహించిన అధికారుల పైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని వంగలపూడి అనిత హెచ్చరించారు.












Click it and Unblock the Notifications