త్వరలో లక్ష మంది తెలుగుదేశం కార్యకర్తలతో ''చలో మంగళగిరి''
త్వరలోనే లక్ష మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ''చలో మంగళగిరి'' కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. కొద్దిరోజులుగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా అన్న క్యాంటిన్ ఏర్పాటు చేస్తే మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు దాన్ని తొలగించారు. ఆ తర్వాత దాన్ని బాలకృష్ణ జన్మదినం సందర్భంగా భోజన ఏర్పాట్లు చేసే కార్యక్రమంగా మార్చారు.
మంగళగిరి నియోజకవర్గం ఏపీ రాజధానిలో కీలకంగా మారింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1985లో డాక్టర్ ఎం ఎస్ ఎస్ కోటేశ్వరరావు విజయం సాధించారు. ఆ తర్వాత పొత్తుల్లో భాగంగా 1994లో సీపీఎం అభ్యర్థి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఒకే ఒక్కసారి మంగళగిరిలో పార్టీ గెలిచింది. అలా కాకుండా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను మంగళగిరిలో పసుపు జెండాను రెపరెపలాడించాలనే పట్టుదలతో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

తర్వాత నియోజకవర్గ మారతారంటూ వార్తలు వస్తున్నప్పటికీ మారే ఉద్దేశం లేదని, రాబోయే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచే పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా ఇప్పటి నుంచే గడప గడపకు ప్రచారం కూడా చేస్తున్నారు. ఈసారి గెలుపు తథ్యమనే భావనలో లోకేష్ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళగిరికున్న ప్రత్యేకతను గుర్తుచేసేలా, మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం కలిగించేలా అతి పెద్ద ర్యాలీ నిర్వహించాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా అందులో భాగంగానే లక్ష మందితో చలో మంగళగిరి కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనిద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి దాన్ని ఎన్నికల వరకు కంటిన్యూ చేయించే ఉద్దేశంలో పార్టీ పెద్దలు ఉన్నారు. త్వరలోనే ''చలో మంగళగిరి'' తేదీని ఖరారు చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications