TTD: శ్రీవారి భక్తులకు ఊహించని అప్డేట్, దర్శనం ఇక- ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్..!!
Tirumala: తిరుమలలో ఈ సారి వేసవి సెలవుల్లో భిన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతీ ఏటా వేసవి లో తిరుమల భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ సారి అదే అంచనాలతో టీటీడీ ముందస్తు చర్యలను చేపట్టింది. వీఐపీ లేఖలను రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకే బ్రేక్ దర్శనాలను పరిమితం చేసింది. అటు ఆపరేషన్ సింధూర్ తో అంచనాలు తారు మారు అయ్యాయి. తిరుమల కు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. క్యూ లైన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో, భక్తులకు దర్శనం మరింత సులభంగా మారింది. శ్రీవాణి దర్శనం టికెట్లు మిగిలిపోతున్నాయి.
సాధారణ రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల పర్యటన పైన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. వేసవిలోనూ క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు ఖాళీగానే ఉన్నాయి. సాధారణంగా వేసవి సెలవుల్లో మొక్కులు తీర్చుకునే భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. దర్శనానికి భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు క్యూ లైన్లు కిలోమీటర్ల మేర వ్యాపిస్తాయి. ఈ ఏడాది మాత్రం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గతేడాది ఎన్నికల నేప థ్యంలో మే 1 నుంచి 10వ తేదీ వరకు 7,04,760 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది కూడా అదే సంఖ్యలో 7,04,689 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

యుద్దం ఎఫెక్ట్
అయితే, టీటీడీ వేసవి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినా.. అంచనాలు తప్పాయి. ఈ ఏడాది వేసవి సెలవుల్లో రద్దీ పెరగకుండా సాధారణంగానే ఉండటానికి ఆపరేషన్ సింధూర్.. తదనంతర పరిణామాలే కారణంగా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది వేసవికి రద్దీ విపరీతంగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేసినప్పటికీ ఉద్రిక్తతల నేపథ్యంలో సాధారణ రద్దీ నెలకొంది. తిరుమల అత్యంత రద్దీతో కూడుకున్న ప్రదేశం కావడంతో చాలా మంది భక్తులు యుద్ధ పరిస్థితి చక్కబడిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్లచ్చనే అభిప్రాయంతో తమ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ నెలలో 1, 2 తేదీలు మినహా ఏ రోజూ కంపార్టు మెంట్లు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో కేవలం 7 నుంచి 12 గంటల్లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకుని తిరుమల పర్యటన పూర్తి చేసుకుంటున్నారు.
భద్రతా ఏర్పాట్లు
ఆపరేషన్ సింధూర్.. ఉద్రిక్తతల వేళ తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేసారు. అందులో భాగంగా 130 మంది ఆక్టోపస్, పోలీసు, నిఘా మరియు భద్రత విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది నాలుగు బృందాలుగా విడిపోయి ఏరియా డామినేషన్ నిర్వహించారు. భారత్-పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించిన సిబ్బంది తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ వంటి రద్దీ ప్రాతాల్లో తనిఖీలు కొనసా గించారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీలు చేసారు. ఈ తరహా తనిఖీలతో భక్తులకు భరోసా నింపటమే తమ లక్ష్యమని అధికారులు ప్రకటించారు. శ్రీవారి వారి భక్తులకు భరోసా లాగా సందేశం ఇవ్వడం జరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications