జస్టిస్ ఎన్వీ రమణ ఉద్వాసన - సుప్రీం అభిశంసన ? కుదరకపోతే జగన్ చివరి ఆప్షన్ అదేనా ?
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తుల సాయంతో తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు ప్రయత్నించారంటూ సీఎం జగన్ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖపై దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. జగన్ లేఖపై ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాకపోవడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో న్యాయనిపుణులు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంతిమంగా జగన్ లేఖ ఆధారంగా జస్టిస్ ఎన్వీ రమణ అభిశంసనకు సుప్రీంకోర్టు సిద్ధపడుతుందా, అలా చేయకపోతే జగనే నేరుగా పార్లమెంటులో అభిశంసన పెట్టిస్తారా అన్నదానిపైనా చర్చ సాగుతోంది.
ఛీఫ్ జస్టిస్‌కు జగన్ లేఖపై విచారణ జరగాల్సిందే ? న్యాయనిపుణులు చెప్తున్న ఐదు కారణాలివే..

జస్టిస్ ఎన్వీ రమణ అభిశంసనపై చర్చ..
ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా జస్టిస్ ఎన్వీ రమణపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటుందా, తీసుకుంటే ఎలాంటి చర్యలు ఉండొచ్చు, అసలు ఈ వ్యవహారంపై విచారణకు కమిటీని నియమించే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయి, ఉంటే కమిటీ నియామకం ఎప్పుడు జరగొచ్చనే చర్చ సర్వత్రా సాగుతోంది. దీనిపై దేశవ్యాప్తంగా న్యాయనిపుణులు, న్యాయ కోవిదులు తమదైన భాష్యాలు వినిపిస్తున్నారు. జగన్ లేఖ ఆధారంగా జస్టిస్ ఎన్వీ రమణపై అభిశంసన పెట్టే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయనే దానిపైనా అదే స్ధాయిలో చర్చ జరుగుతోంది. దీంతో రాజ్యాంగంలో ఈ మేరకు ఉన్న అవకాశాలు ఏంటి ? వాటిని సుప్రీంకోర్టు అనుమతిస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

జడ్జీల అభిశంసనపై రాజ్యాంగం ఏం చెబుతోంది ?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4), (5) సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న వారిని వారి దుష్ప్రవర్తన, అసమర్ధత కారణంగా తొలగించేందుకు అవకాశముంది. అయితే వీరిని తొలగించేందుకు పార్లమెంటు అభిశంసన తీర్మానం తప్పనిసరి అవుతుంది. ఇందుకోసం సుప్రీంకోర్టు సదరు న్యాయమూర్తిపై వచ్చిన ఫిర్యాదులపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్డి, ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ ఛైర్మన్ సిఫార్సు చేసిన న్యాయనిపుణుడు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సదరు న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలకు ప్రాధమిక ఆధారాలు లేవని భావిస్తే ఆరంభ దేశలోనే తిరస్కరించవచ్చు. లేదా అనుమతించి తదుపరి విచారణ జరపవచ్చు. అలా విచారణ జరిగి దోషిగా నిర్ధారణ అయితే అప్పుడు పార్లమెంటుకు సదరు న్యాయమూర్తిని అభిశంసించాలంటూ సుప్రీంకోర్టు సిఫార్సు చేసే అవకాశముంది. అలాగే హైకోర్టు న్యాయమూర్తుల విషయంలోనూ ఆర్టికల్ 218 ప్రకారం అభిశంసన కోరవచ్చు.

తొలిసారి చరిత్రలో తొలిసారి అవుతుందా ?
70 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రను గమనిస్తే ఇప్పటివరకూ పలుమార్లు హైకోర్టు న్యాయమూర్తుల అభిశంసన జరిగింది కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిశంసన మాత్రం జరగలేదు. హైకోర్టు జడ్జిలపైనా అభిశంసన ప్రక్రియ మొదలు కావడమే తప్ప పూర్తి కాకముందే వారు తప్పుకున్న సందర్భాలే ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వీ రమణపై వచ్చిన ఆరోపణలను విచారించడం, వాటిని నిర్ధారించడం, పార్లమెంటు అభిశంసనకు సిఫార్సు చేయడం సుప్రీంకోర్టుకు అగ్నిపరీక్షే కానుంది. దీంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

సుప్రీం కాదంటే పార్లమెంటులో వైసీపీ అభిశంసన ?
ఏపీలో గతంలో చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన జస్టిస్ చంద్రారెడ్డి విషయంలో అనధికారికంగా విచారణ జరిపిన అప్పటి సుప్రీం ఛీఫ్ జస్టిస్ గజేంద్ర గడ్కర్ ఆయనపై ఆరోపణలను నిర్ధారించి, చంద్రారెడ్డిని మద్రాసు హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సూచించినట్లు ఆయన తన పుస్తకంలో రాశారు. ఇప్పుడు అంతకంటే మించి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణపై వచ్చిన ఆరోపణల విషయంలో సుప్రీంకోర్టు అభిశంసనను కోరుకుటుందా లేక పక్కనబెడుతుందా అన్న చర్చ జరుగుతోంది. అయితే జస్టిస్ రమణపై సుప్రీంకోర్టు అభిశంసనకు మొగ్గు చూపకపోతే సీఎం జగన్ పార్లమెంటులో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ తరఫున పార్లమెంటులో అభిశంసన కోరే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ సాగుతోంది. అలాంటి పరిస్ధితి తిరిగి సుప్రీంకోర్టుకు ఇబ్బందికరంగా మారవచ్చనే వాదన వినిపిస్తోంది. కాబట్టి ఈ వ్యవహారంలో త్వరలో సుప్రీం ఛీఫ్ జస్టిస్ ఏదో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.