700 రహస్య జీవోలు, బాబు సవాల్‌కు సిద్ధం: వాసిరెడ్డి, రాక్షస పాలన సాగుతోందన్న రఘువీరా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 700 జీవోలను రహస్యంగా ఉంచారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ 700 చీకటి జీవోలు ఎవరికోసమని ఈ సందర్భంగా ఆమె సూటిగా ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. జీవోల బండారంపై ఏపీ సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవాల్‌కు తాము సిద్ధమేనని తెలిపారు.
రాయలసీమ జిల్లాల అభివృద్ధి అంశంపై ప్రతిపక్షనేతలు బహిరంగ చర్చకు రావాలని ఇటీవల చంద్రబాబు సవాల్ చేసిన నేపథ్యంలో పై విధంగా స్పందించారు. రాయలసీమకు చెందిన ఏ జిల్లాకు చంద్రబాబు న్యాయం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్నేహితుడికి, గల్లా అరుణకుమారికి వందల కోట్ల విలువైన భూములను చక్కగా కట్టబెట్టారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.

రాక్షసపాలన సాగుతోంది: రఘువీరా
దేశంలో, రాష్ట్రంలో దుష్ట, రాక్షస పాలన కొనసాగుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు మతం పేరుతో మారణహోమాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మోడీ, బాబు కలసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కులమతాలకు అతీతంగా లౌకికవాదానికి కట్టుబడిన వ్యక్తి నెహ్రూ అని అన్నారు. ప్రపంచ దేశాలలో భారత్‌కు నెహ్రూ మంచి గుర్తింపు తెస్తే మోడీ మాత్రం విదేశాలలో భారత్‌ను చులకన చేసి మాట్లాడుతూ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారని రఘువీరారెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications