సర్పంచిని చేస్తే రూ.70 లక్షలు ఇస్తా - ఆ పంచాయతీ కోసం, వైరల్ పోస్ట్!
వైఎస్ఆర్ కడప జిల్లా సుండుపల్లి మండలం రాయవరం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. జనసేన పార్టీ నాయకుడు లక్ష్మీనారాయణ తన భార్య వెంకటలక్ష్మిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.70 లక్షలు జమ చేస్తానని ప్రకటించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. లక్ష్మీనారాయణ గ్రామ పెద్దలను కలిసి తన మనోగతాన్ని వ్యక్తం చేశారు.
తాము జమ చేసే నిధులతో గ్రామానికి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని దంపతులిద్దరూ స్పష్టం చేశారు. రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, పాఠశాలల అభివృద్ధి వంటి అవసరాలకు ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పారు.లక్ష్మీనారాయణ గతంలో రాయవరం, తిరుపతిలో ఆర్‌ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత కువైట్‌కు వెళ్లి 15 ఏళ్ల పాటు వైద్య రంగంలో పని చేశారు. ప్రస్తుతం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు.

గతంలో రాయవరం ఎంపీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. భార్య వెంకటలక్ష్మి కూడా గతంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయారు.జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో కువైట్‌లోని ఎన్‌ఆర్‌ఐలతో కలిసి పార్టీకి నిధులు సమకూర్చిన అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న లక్ష్మీనారాయణ తన కుమారులిద్దరికి సినీ పరిశ్రమలో అవకాశాలు కల్పించేందుకు శిక్షణ ఇప్పిస్తున్నారు.
అయినా ఎక్కడున్నా స్వగ్రామమైన రాయవరం పంచాయతీకి సేవ చేయాలనే కోరిక ఉందని దంపతులు చెప్పారు.పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే గ్రామంలో వివాదాలు తగ్గి, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని కొందరు గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి ఆఫర్లు ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. రాయవరం గ్రామస్థులు ఈ ప్రకటనను ఆసక్తిగా చూస్తున్నారు.
గ్రామాభివృద్ధికి నిధులు వస్తే మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు.పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు మరిన్ని రావచ్చు. గ్రామస్థులు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. లక్ష్మీనారాయణ దంపతులు తమ ప్రతిపాదనను గ్రామం ముందుంచి, సేవ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.













Click it and Unblock the Notifications
