మేం అనుకుంటే అడుగుపెట్టలేవు.. జగన్ కు పరిటాల సునీత వార్నింగ్..!
ఇవాళ సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటనలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన విమర్శలకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఘాటు కౌంటర్ ఇచ్చారు. జగన్ పరామర్శకు వచ్చాడా.. ఎన్నికల ప్రచారానికి వచ్చాడా అని ఆమె ప్రశ్నించారు. చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. నీ చుట్టూ ఉన్న వాళ్లు ఆ కుటుంబాన్ని చూసి నవ్వుతున్నారని తెలిపారు.
నువ్వు నవ్వుతున్నావో.. ఏడుస్తున్నావో అర్థం కావడం లేదంటూ జగన్ ను ఉద్దేశించి పరిటాల సునీత వ్యాఖ్యానించారు.
తాము అనుకుని ఉంటే జగన్ ఇక్కడ అడుగు కూడా పెట్టలేడన్నారు. తనను, తన కుమారుడిని టార్గెట్ చేయడానికే జగన్ వచ్చాడన్నారు. ఆరోజు పులివెందులకు వెళ్తే తన భర్త పరిటాల రవిని అడ్డుకున్నారని, ఈ రోజు మళ్లీ తనను, తన కొడుకుని టార్గెట్ చేశాడని జగన్ పై సునీత ఫైర్ అయ్యారు.

రాప్తాడు టూర్ లో జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ ు జగన్ చదువుతున్నాడన్నారు. పరీక్షల్లో కాపీ కొట్టినట్టుగా పేపర్లు చూసి చదువుతున్నాడన్నారు. పాపిరెడ్డిపల్లిలో అనుకోకుండా ఒక సంఘటన జరిగిందని, కానీ దాన్ని కొడవండ్లు, మారుణాయుధాలు అంటున్నారని ఆక్షేపించారు. అలాంటివి పులివెందులలోని బాత్ రూముల్లో చంపేందుకు ఉపయోగిస్తారన్నారు. గ్రామాల్లోకి వచ్చి చిచ్చు పెట్టాలని జగన్ చూస్తున్నాడన్నారు.
మీ చిన్నాన్నని చంపితే న్యాయం చేయమని మీ చెల్లలు అడిగిందని జగన్ కు సునీత గుర్తుచేశారు.. చెల్లలుకు న్యాయం చేయలేని నువ్వు ఇక్కడికొచ్చి ఏం చేస్తావ్ అని ప్రశ్నించారు. తల్లి, చెల్లెళ్లకు న్యాయం చేయలేని నువ్వు లింగమయ్య కుటుంబానికి ఏం న్యాయం చేస్తావ్ అని నిలదీశారు. మాజీ సీఎం గా ఉండి ఎస్ఐ గురించి నీచంగా మాట్లాడుతున్నావ్ అని ఆరోపించారు. పోలీసులను గుడ్డలూడదీస్తానని జగన్ చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీతో పాటు పోలీసులు ఇప్పటికైనా స్పందించాలన్నారు.

పోలీసులు నీకు ఈ రోజు రెడ్ కార్పెట్ వేశారని, ఎస్ఐ మాకు ఫోన్ చేయించాడని బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పాలని జగన్ ను సునీత కోరారు. తాము భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతామని సవాల్ చేశారు. జగన్ పర్యటనను పోలీసులు, తమ వాళ్లు ఎక్కడా అడ్డుకోలేదన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యల మీద కచ్చితంగా పోలీసులు స్పందించాలన్నారు. ఎంపీపీ ఎన్నికను గెలుచుకోలేక తోపు జీరో అయ్యాడన్నారు. ఆ జీరో మాటలు విని ఇంత దూరం జగన్ వచ్చాడన్నారు.












Click it and Unblock the Notifications