కేంద్రాన్ని సాయిరెడ్డి ఫిక్స్ చేసారా-ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : వెంకయ్య సాక్షిగా..!!
రాష్ట్ర విభజన సమయం నుంచి అమలు కాని డిమాండ్ గా ఉండిపోయిన ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరో సారి తెర మీదకు వచ్చింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి అయిదేళ్ల పాటు ప్రత్యేక హోదా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నాటి రాజ్యసభ విపక్ష నేత..ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీకి అయిదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్ది..ప్రస్తుత ప్రధాని సైతం ఏపీకి ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చారు.

తెర పైకి మరోసారి ప్రత్యేక హోదా
ఆ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. మధ్యలో రాజకీయంగా ప్రత్యేక ప్యాకేజీ అంటూ..ఆ తరువాత ఆ ప్రతిపాదన సైతం నిలిచిపోయింది. ఇక, ఇప్పుడు తాజాగా హోదా అమలు చేయాలంటూ ఏకంగా పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సుగా రాజ్యసభ ఛైర్మన్ కు నివేదిక సమర్పించింది. హోదాతో పాటుగా.. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం పట్టుబట్టింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యంపై వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

విశాఖ కేంద్రంగా రైల్వో జోన్ పై సిఫార్సు
జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో రాజధాని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కనీసం పదేళ్లకు తగ్గకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది. దీని ద్వారా రాష్ట్రాల్లో సమగ్ర అభివృద్ధికి దోహదం చేయటంతో పాటుగా వాణిజ్యం, అదే విధంగా ఎగుమతుల్లో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. ఎగుమతులను పెంచేందుకు మౌలిక వసతుల విస్తరణ కోసం రూపొందించిన 164వ నివేదికను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ వి.విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు సమర్పించారు.

ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు
కొత్తగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలకు 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడాన్ని కమిటీ ప్రశంసించింది. ఆ ప్రాంతాల్లో మౌలిక వసతుల స్థాపనకు, ఆర్థికాభివృద్ధికి, ఎగుమతుల పెంపునకు దోహదపడుతుందని పేర్కొంది. ఇదే తరహాలో ఇతర కొత్త రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లకు కూడా తగిన పరిహారం చెల్లించాలని కమిటీ అభిప్రాయపడుతూ.. రాష్ట్రాల విభజన కారణంగా రాజధానులు కోల్పోయిన ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది.

వాల్తేరు రైల్వే డివిజన్ పై కమిటీ నివేదిక
ఇదే నివేదికలో..విశాఖ జోన్‌కు ఇప్పటికే ఆమోదం లభించిందని, డీపీఆర్ ఇంకా మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని, కొత్త జోన్ కార్యాచరణకు కాలపరిమితిని నిర్ణయించలేమని ఆ శాఖ నుంచి సమాచారం వచ్చిందని కమిటీ నివేదికలో ప్రస్తావించింది. భారతీయ రైల్వేలలో 5వ అత్యధిక ఆదాయాన్ని అందించే డివిజన్ అయిన వాల్తేరు డివిజన్ రద్దుకు కారణాలు అడిగితే విశాఖలో జోనల్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు అవుతున్నందున పరిపాలన ప్రాతిపదికన మాత్రమే విశాఖలో డివి జన్ కేంద్రాన్ని తీసివేశామని రైల్వే శాఖ తెలిపింది.

సాయిరెడ్డి నాయకత్వంలో వెంకయ్యకు రిపోర్టు..
వాల్తేరు డివిజన్ కొనసాగింపు రోజువారీ కార్యకలాపాలలో గానీ, ఈ ప్రాంత దీర్ఘకాలిక రైల్వే అభివృద్ధిలో ఎటువంటి విలువను జోడించదని ఆ శాఖ తెలిపింది. వాల్తేరు డివిజన్‌ను పొరుగున ఉన్న విజయవాడ డివిజన్‌లో విలీనం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల వ్యవస్థ సజావుగా సాగుతుందని తెలిపిందని రిపోర్టులో వెల్లడించారు. కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నప్పుడు, డివిజన్ కార్యాలయం మినహా విశాఖ కేంద్రంగా ఉన్న ప్రస్తుత రైల్వే వ్యవస్థ చాలా వరకు అలాగే ఉంటుందని స్పష్టం చేసింది.

అంతర్యాన్ని అర్దం చేసుకోలేకపోతున్నాం
వాల్తేరు డివిజనల్ ఆఫీస్‌తో సహా విశాఖలో ప్రస్తుతం ఉన్న రైల్వే సిబ్బందిలో ఎక్కువ మంది విశాఖలోనే సాధ్యమైనంత వరకు అక్కడే ఉంటారని కమిటీకి సమాచారం అందించింది. పరిపాలనా, కార్యాచరణ అవసరాలతో సహా అన్ని సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు తమ కమిటీకి సమాచారం ఇచ్చారంటూ..స్టాండింగ్ కమిటీ పేర్కొంది. వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామంది.
Recommended Video

వెంకయ్య చేతికి సాయిరెడ్డి టీం నివేదిక..వాట్ నెక్స్ట్
వాల్తేరు డివిజన్‌ను కుదించే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని స్టాండింగ్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. అదే విధంగా.. గుంటూరు నుంచి ప్రతినెలా 1.80 లక్షల టన్నుల మిరప పంట ఎగుమతి అవుతుందని, వీటికి సాధారణ గిడ్డంగులు కాకుండా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖతో సమన్వయం చేసుకుని గుంటూరు జిల్లాలో తగిన సంఖ్యలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని వాణిజ్య శాఖకు కమిటీ సిఫారసు చేసింది. ఇక, ఇప్పుడు ఈ సిఫార్సులు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు అందటంతో..దీని పైన మరో సారి ఏపీలో ప్రత్యేక హోదా పైన చర్చతో పాటుగా కేంద్ర నిర్ణయం కోసం ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక, ఇప్పుడు మరోసారి ప్రత్యేక హోదా తెర పైకి రావటం, అందునా వెంకయ్య నాయుడు చేతికి నివేదిక రావటంతో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయంగా చెబుతూ వస్తోంది. స్టాండింగ్ కమిటీ సిఫార్సు లపైన కేంద్రం ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది..దీని పైన రానున్న రోజుల్లో కమిటీకి నాయకత్వం వహించిన విజయ సాయి రెడ్డి ఏం చేయబోతున్నారనేది మరో ఇంట్రస్టింగ్ ఇష్యూగా మారుతోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం తాము ప్రతీ సందర్భంలోనూ హోదా గురించి గుర్తు చేస్తూనే ఉంటామని చెబుతోంది. దీనిని తమకు అనుకూలంగా మలచుకొనేందుకు వైసీపీ ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications