తప్పుదోవ పట్టించేందుకే: జగన్ పర్యటనపై పత్తిపాటి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించడం వల్ల రైతులకు, ప్రజలకు ఒరిగేదేమి లేదని అన్నారు.
జగన్ గుంటూరులో పర్యటించాలంటే మొదట ఆయనకు చెందిన సరస్వతి పవర్ ప్లాంట్ కోసం తీసుకున్న భూములను రైతులకు తిరిగిచ్చేయాలని పత్తిపాటి డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే మార్చి 3న జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. 30వేల ఎకరాల భూమి సేకరించాక జగన్ పర్యటనతో ఒరిగేదేమి లేదని అన్నారు.

అసాంఘిక శక్తులను అదుపు చేస్తాం: చినరాజప్ప
రాష్ట్రంలో అసాంఘిక శక్తులను అదుపు చేస్తామని ఏపి హోంమంత్రి చినరాజప్ప అన్నారు. విజయవాడలో నైట్ డామినేషన్‌ను నిలిపివేశామని చెప్పారు. అంతర్జాతీయ స్మగ్లర్ గంగిరెడ్డిని రాష్ట్రానికి రప్పిస్తామని తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలోకి రాజధాని ప్రాంతం వచ్చే అంశంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
ఏపిలో మావోయిస్టుల కదలికలు లేవని, ప్రత్యేక బలగాలతో నిఘా ఉంచామని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనంతో బాధితులకు న్యాయం జరుగుతుందని చినరాజప్ప చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 14వేల కానిస్టేబుళ్ల నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపారు.
ఏపి పాలన సింగపూర్ నుంచి నడుస్తోంది: అంబటి
పోలీసుల సాయంతో రాజధాని ప్రాంతంలో రైతుల భూములను ఏపి మంత్రులు లాక్కుంటున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల తరహాలో ఏపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపి పాలన సింగపూర్ నుంచి నడుస్తోందని అన్నారు. మేథా పాట్కర్, అన్నా హజారే, అగ్నివేశ్‌లు త్వరలో ఏపి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications