Mulakhat : జైల్లో చంద్రబాబుతో పవన్, బాలయ్య, లోకేష్ ములాఖత్-జగన్ సర్కార్ పై విమర్శలు..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ, నారా లోకేష్ కలిశారు. ఇవాళ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కోసం నిన్న అనుమతి తీసుకున్న పవన్, బాలయ్య, లోకేష్.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జైలుకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ముందుగా బాలయ్య, లోకేష్ జైల్లోకి వెళ్లగా.. అనంతరం పవన్ కళ్యాణ్ విడిగా వెళ్లి ములాఖత్ అయ్యారు.

అనంతరం బయటికి వచ్చాక పవన్ మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన చూస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందులో భాగంగానే మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా కేసులు పెట్టి చట్ట విరుద్ధంగా రిమాండ్ కు పంపడం బాధాకరమన్నారు. వారికి సంఘీభావం ప్రకటించడానికి జైలుకు వచ్చానన్నారు. చంద్రబాబుకూ, తనకూ విధానాల పరంగా భిన్నమైన ఆలోచనలు ఉన్నాయని, విడిగా కూడా పోటీ చేశామన్నారు. జనసేన తరఫున తాను రాష్ట్రం బావుండాలని,దేశ సమగ్రత ఉండాలని కోరుకున్నానన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత యూపీఏ సర్కార్ ఏపీకి న్యాయం చేయలేకపోయిందని, సగటు మనిషి వేదన తాను జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడినట్లు గుర్తుచేశారు. 2014లో మోడీకి మద్దతు తెలిపినప్పుడు బీజేపీలో దాన్ని వ్యతిరేకించిన వర్గం ఉందన్నారు. దక్షిణాదిలో ముందుగా తాను ముందుకొచ్చి మోడీకి మద్దతిచ్చానన్నారు. గతంలో తాను టీడీపీకి మద్దతివ్వడానికి కారణం విభజన తర్వాత అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలనుకోవడమే అని పవన్ తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్ లో ఓ కొత్త సిటీ సృష్టించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబుతో రాజకీయంగా తనకు భేదాభిప్రాయాలున్నా ఆయన శక్తిని తక్కువ అంచనా వేయలేనన్నారు.
ఇవాళ 317 కోట్లు స్కాం అని చెప్పి వేధిస్తున్నారన్నారు. బ్యాంకులో స్కాం జరిగితే ఛైర్మన్ ను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. గుజరాత్ లో ప్రారంభమైన కంపెనీని ప్రాతిపదికగా తీసుకుని ఏపీలో కూడా పెట్టారన్నారు. తప్పొప్పులు జరిగితే సంబంధిత వ్యక్తులందరినీ తీసుకెళ్లి విచారించాలన్నారు. సైబరాబాద్ వంటి సిటీ నిర్మించిన వ్యక్తికి 317 కోట్ల స్కాం పేరుతో జైలుకు పంపడం బాధాకరమన్నారు. చంద్రబాబుపై ఈ కేసులు మోపిన వ్యక్తి ఆర్ధిక నేరాలు చేసిన హార్డ్ కోర్ క్రిమినల్ అన్నారు. ఆయన జైలుకెళ్లారని చంద్రబాబును కూడా జైలుకు పంపడం సరికాదన్నారు. ఈ అభియోగాలు మోపిన వ్యక్తి ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రియా, వాజ్ పేయా అని అడిగారు.
ఈరోజుకూ ఈడీ కేసులున్న వ్యక్తి, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకెళ్లాల్సిన వ్యక్తి అని జగన్ ను విమర్శించారు. విదేశీ ఒప్పందాలకు దేశంలో నిబంధనల్ని ఖాతరు చేయని వ్యక్తి జగన్ అన్నారు. వాలంటీర్ల ద్వారా డేటా చౌర్యం చేస్తూ రాజ్యాంగం, చట్టాలు ఉల్లంఘించిన వ్యక్తి అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు.
ఇచ్చిన హామీలేవీ నిలబెట్టుకోలేని వ్యక్తి అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా అన్నారు. తాను రాష్ట్రానికి వస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో భిన్నమైన వాయిస్ లు ఉంటాయని, ఉండకూడదంటే ఎలా అన్నారు. జగన్ పాలన సరిగ్గా చేసుంటే బాలకృష్ణ, లోకేష్ తో కలిసి ఇలా వచ్చి మాట్లాడాల్సిన అవసరం తనకు వచ్చేది కాదన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని తాను చెప్పడానికి కారణం జగనే అన్నారు.












Click it and Unblock the Notifications