ఎన్నికల్లో ఘనవిజయం .. ఏపీలో అధికారం.. నూకాంబికా అమ్మవారి మొక్కు తీర్చుకున్న పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు టీడీపీ కూటమికి అధికారాన్ని తెచ్చిపెట్టాయి. అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు కూటమి విజయం సాధించడం వెనుక మాత్రం కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. టిడిపి బిజెపి జనసేన కూటమి ఏర్పాటు వెనుక కూడా పవన్ కళ్యాణ్ దే కీలకపాత్ర అన్నది తెలిసిందే..
కూటమి వెనుక కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్
గత పదేళ్ల నుంచి రాజకీయాలలో జనసేన పార్టీతో తీవ్రంగా పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ కూర్చుంది పవన్ కళ్యాణ్ కాదు తుఫాన్.. సునామీ అంటూ వ్యాఖ్యలు చేశారంటే కూటమి విజయం వెనక పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.

మొక్కులు చెల్లించుకుంటున్న పవన్ కళ్యాణ్
ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేస్తున్న ప్రతి చోట విజయం సాధించడం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేవుళ్లకు మొక్కులు చెల్లించుకున్నారు . ఎన్నికల ప్రచార సమయంలో ఉత్తరాంధ్రలోని నూకాంబిక అమ్మవారిని, ఎన్నికల్లో విజయం ఇచ్చి అనుగ్రహించాలని పవన్ కళ్యాణ్ మొక్కుకున్నారు.
అనకాపల్లి నూకాంబికా అమ్మవారికి మొక్కులు చెల్లించిన పవన్
తాజాగా ఆయన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ విజయం సాధించడంతో, ఇదంతా అమ్మ దయతోనే సాధ్యమైందని పవన్ కళ్యాణ్ నేడు ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాంబికా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకుంటానని ప్రచారంలో చెప్పిన పవన్, ప్రస్తుతం ఏపీలో అధికారంలోకి రావడంతో మొక్కు తీర్చుకున్నారు.

హడావిడి లేకుండా సైలెంట్ గా మొక్కులు చెల్లించిన పవన్
ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా పవన్ కళ్యాణ్ మొక్కలు చెల్లించుకున్నారు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న వారిలో పవన్ వెంట అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా ఉన్నారు. ఈరోజు ఉదయమే హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ జనసేన నాయకులతో కలిసి అనకాపల్లి వెళ్లారు.
అనకాపల్లిలో పవన్ ఫ్యాన్స్ హంగామా
నూకాంబికా ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ఆపై పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పవన్ రాక నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ నూకాలమ్మ దర్శనానికి వస్తున్నారని తెలిసి పవన్ అభిమానులు భారీగా అనకాపల్లికి చేరుకున్నారు. సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ సాధించడంతో అనకాపల్లికి పవన్ కళ్యాణ్ వచ్చిన క్రమంలో పవన్ ఫ్యాన్స్ హంగామా చేశారు.












Click it and Unblock the Notifications