రంగంలోకి పవన్ కళ్యాణ్: రాజధాని గ్రామాల్లో పర్యటన: జనసేనాని కీలక వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానుల అంశం పైన జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జనసేన పార్టీ ముఖ్య నేతలతో విస్తృతస్థాయి సమావేశం ఈ రోజు మంగళగిరి కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరుగుతోంది. ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితులు..ప్రధానంగా మూడు రాజధానుల రగడ పైన ఈ సమావేశంలో పార్టీ నేతల నుండి పవన్ అభిప్రాయలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
అదే సమయంలో ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పర్యటించి..రైతులకు సంఘీభావం ప్రకటించిన పార్టీ నేతలు నాగబాబు..నాదెండ్ల మనోహర్ పార్టీ అధినేతకు అమరావతి పైన నివేదిక అందించారు. సున్నిత అంశం కావటంతో తానే స్వయంగా అమరావతి రైతులతో మాట్లాడాలని పవన్ నిర్ణయించారు. రైతులు చేస్తున్న నిరసన శిబిరాల వద్దకు వెళ్లి వారికి సంఘీభావం ప్రకటించనున్నారు. అదే సమయంలో అక్కడి నుండే తమ విధానం ఏంటో పవన్ స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది.

ఏపీలో రగులుతున్న మూడు రాజధానుల అంశం పైన జనసేన అధినేత పవన్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే పార్టీ నేతలు అమారావతి ప్రాంత రైతులతో మాట్లాడి..వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. పార్టీ నేతలు నాగబాబు..నాదెండ్ల మనోహర్ అక్కడి పరిస్థితుల పైన అధినేతకు నివేదిక సమర్పించారు. పార్టీ ముఖ్య నేతలతో సాగుతున్న విస్తృతస్థాయి సమావేశంలో జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేసారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకరికి న్యాయం చేసి, మరొకరికి అన్యాయం చేయాలని ఎవరూ కోరుకోరని అన్నారు. ప్రస్తుతం ఏపీలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ ఒక అవగాహనకు రావాలన్నారు. జిల్లాలవారీగా ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు తమ అభిప్రా యాలను స్పష్టంగా చెప్పాలని పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు.

పవన్ పర్యటన తరువాతనే స్పష్టత..
ఇదే భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల మీద చర్చ చేస్తున్నారు. అయితే, ప్రధాన అంశంగా మూడు రాజధానుల విషయం కావటంతో..అన్ని ప్రాంతాల నేత అభిప్రాయాలను పవన్ సేకరిస్తున్నారు. పార్టీలో అన్ని ప్రాంతాలకు చెందిన వారు అభిప్రాయాలను స్వేచ్చగా చెప్పే అవకాశం ఇవ్వటం ద్వారా పార్టీ నిర్ణయం ఏంటనేది స్పష్టత వస్తుందని వివరిస్తున్నారు.
ఇక, రాజధాని గ్రామాల్లో పర్యటించి రాజధాని తరలింపు ప్రతిపాదన పైన రైతుల అభ్యంతరాలు..వారి ఆవేదన తెలుసుకోవాలని పవన్ నిర్ణయించారు. వారి ఆవేదనకు కారణాలను తెలుసుకుంటూనే.. ఇతర ప్రాంతాల్లోని వారి మనోభావాలను గౌరవిస్తూ తమ పార్టీ అధినేత రాజధాని గ్రామాల్లో పర్యటన తరువాత ఈ సున్నిత అంశం మీద స్పందిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications