Varahi Bike : అమలాపురంలో "వారాహి" బైక్ - పవన్ వాహనం పోలికతో అభిమాని తయారీ ! యాత్రకూ రెడీ..
Varahi Bike : పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్న వేళ అమలాపురంలో ఆయన అభిమాని ఒకరు అలాంటి రంగులతోనే ఓ బైక్ తయారు చేయించుకున్నాడు. ఇప్పుడీ బైక్ పట్టణంలో చూపరుల్ని ఆకట్టుకుంటోంది.
అమలాపురం : పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై ఏపీలో జరుగుతున్న రచ్చ చూస్తూనే ఉన్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల యాత్ర చేపట్టేందుకు పవన్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న వారాహి వాహనానికి తాజాగా పవన్ పూజలు కూడా చేయించారు. త్వరలో దీనిపై యాత్ర ప్రారంభానికి సిద్దమవుతున్నారు. దీనిపై వైసీపీ నేతల విమర్శల నేపథ్యంలో రాష్ట్రంలో దీని క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు దీని స్ఫూర్తితో అవే రంగులతో పవన్ అభిమాని ఒకరు బైక్ తయారు చేయించుకున్నారు.

వివాదాల వారాహి
పవన్ కళ్యాణ్ ఏపీలో వచ్చే ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి వారాహి వాహనాన్ని తయారు చేయించుకున్నారు. దీనిపై యాత్ర చేయడం ద్వారా అభిమానుల తాకిడి తట్టుకోవడంతో పాటు పలు ప్రయోజనాలు ఉంటాయని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. వారాహి ఏపీలో ఎలా ఎంట్రీ ఇస్తుందో చూస్తామన్నారు. రోడ్లపై తిరగాలంటే ఇక్కడి రూల్స్ పాటించాలన్నారు. చివరికి పూజల కోసం పవన్ వారాహి వాహనం విజయవాడ దుర్గగుడికి తాజాగా తీసుకొచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

రాష్ట్రంలో వారాహి క్రేజ్
పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై జరిగిన చర్చతో రాష్ట్రంలో దీనికి క్రేజ్ కూడా అదే స్దాయిలో పెరిగిపోయింది. ఇప్పుడు పవన్, జనసేన అభిమానులు ఎక్కడ చూసినా వారాహి రంగు దుస్తులతో కూడా కనిపిస్తున్నారు. అలాగే తన వాహనాలకు వారాహి రంగులు వేయించుకుంటున్నారు. అలాగే వారాహి రంగు జెండాలు, పోస్టర్లు కూడా తయారు చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి వారాహి క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో పవన్ అభిమానులు వారాహితో మరో ప్రయోగం కూడా చేశారు.

అమలాపురంలో వారాహి బైక్
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇప్పుడు వారాహి బైక్ దర్శనమిచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి కలర్లో ఎలక్ట్రికల్ బైక్ కొన్న ఆయన అభిమాని ఒకరు ఇప్పుడు దాన్ని అచ్చు వారాహి తరహాలోనే మార్చుకున్నారు. పవన్ పై అభిమానంతో ఈ రంగును వెతికి వెతికి కొన్న సదరు అభిమాని ఇప్పుడు దాంతో రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఆయన్ను చూసేందుకు పవన్, జనసేన అభిమానులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ బైక్ కు సంబంధించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం..
వారాహి బైక్ యాత్రకు రెడీ ?
పవన్ వారాహి వాహనంపై జరుగుతున్న రచ్చ నేపథ్యంలో అలాంటి రంగుతోనే బైక్ కొనాలని భావించిన పవన్ అభిమాని పొట్టుపోతు దొరబాబు.. సరిగ్గా అదే రంగుతో ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి కి చెందిన పొట్టుపోతు దొరబాబు..వారాహి కలర్ కోసం అధిక డబ్బులు వెచ్చించి మరీ దీన్ని కొన్నారు. అంతే కాదు దీనిపై వారాహి అంటూ స్టిక్కరింగ్ కూడా చేశారు. పవన్ వారాహి వాహనంపై ప్రచారం చేస్తే తాను బైక్ తో ప్రచారం చేస్తానని దొరబాబు చెప్తున్నారు. పవన్ వారాహిని తిరగనివ్వబోమని అంటున్న వారికి దొరబాబు హెచ్చరికలు కూడా చేశారు. నేను తిరుగుతాను నన్నెవరైనా ఆపండి అని సవాల్ విసిరారు. పవన్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తాను కూడా బైక్ పై ప్రచారం చేసి జనసేన ను బలోపేతం చేస్తాని దొరబాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications