కాకినాడ చేరుకున్న పవన్: ఉత్కంఠ, ఏం చెప్తారు? పోటెత్తిన ఫ్యాన్స్, తోపులాట.. లాఠీఛార్జి
అమరావతి: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చేరుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆత్మగౌరవ సభ పేరిట శుక్రవారం కాకినాడలోని జేఎన్టీయూ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కాకినాడకు చేరుకున్నారు.
కాకినాడలోని జీఆర్టీ హోటల్‌లో ఆయన బస చేస్తున్నారు. దీంతో నగరానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు ఆయన అభిమానులు పోటెత్తారు. దీంతో అభిమానులకు, పోలీసులకు మధ్య స్వల్పంగా తోపులాట జరిగింది. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అభిమానులపై లాఠీఛార్జి చేశారు.

రేపటి పవన్ సభపై సర్వత్రా ఉత్కంఠ
ఏపీలో ఆందోళనలు ఉద్ధృతమవుతోన్న వేళ రేపటి పవన్ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ బస చేసిన
జీఆర్టీ హోటల్ పరిసర ప్రాంతంలోకి మీడియాను అనుమతించడం లేదు. మరోవైపు ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రానివేళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలకు దిగారు.

హోదాపై కాకినాడ సభలో ఏం మాట్లాడుతారు?
ప్రత్యేక హోదా పైన ఆయన కాకినాడ సభలో ఏం మాట్లాడుతారు? ఎవరిని నిలదస్తారు? ఎల్లుండి బందుకు మద్దతు పలుకుతారా? హోదా లేదా ప్యాకేజీ విషయంలో తిరుపతి సభలో వలే కేవలం బీజేపీనే టార్గెట్ చేస్తారా? లేక చంద్రబాబును కూడా నిలదీస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

హోదా కావాలని పట్టుబడుతున్న పవన్
ఇప్పటికే ప్రత్యేక హోదా కావాలని పట్టుబడుతున్న పవన్ కళ్యాణ్.. కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీకి ఒకే చెబుతారా? లేక హోదా తప్ప మరేం అవసరం లేదని అంటారా? అనేదానిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పవన్ స్పందన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

జేఎన్‌టీయూ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ
కాగా, కాకినాడ జేఎన్‌టీయూ క్రీడా మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించేందుకు అనుమతి కోరినట్లు కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మైదానం సామర్థ్యం 75,000 వరకు ఉంటుందని అనుమతి లేఖలో నిర్వాహకులు పేర్కొన్నట్లు చెప్పారు. 11.6 ఎకరాల విస్తీర్ణం ఉన్న మైదానంలో సభా ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి.

పవన్ సభ విజయవంతం కావాలని పూజలు
మరోవైపు, పవన్ సభ విజయవంతం కావాలని కోరుతూ.. కాకినాడ గ్రామీణం పరిధిలోని రాజ్యలక్ష్మి సమేతభావనారాయణస్వామి ఆలయంలో జనసేన కార్యకర్తలు బుధవారం పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి తాళ్లరేవు మండలం మట్లపాలెంలోని మహలక్ష్మమ్మ ఆలయం వరకు 22 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. రాజమహేంద్రవరం, అమలాపురం పరిధిలోనూ జనసేన కార్యకర్తలు పాదయాత్రలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications