కాకినాడకే పవన్: పోటీపై డైలమా, అప్పుడే పూర్తి పార్టీగా
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ పెట్టడం దాదాపు ఖాయమైంది. అయితే, శాసన సభకు పోటీ చేయాలా లేక లోకసభకు పోటీ చేయాలా అనే దానిపై పవన్ చర్చలు జరుగుతున్నాయి. పవన్ మల్కాజిగిరి లేదా కాకినాడ లోకసభ స్థానానికి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, కాకినాడ లోకసభ స్థానం నుండి బరిలోకి దిగాలని పవన్ ఆలోచిస్తున్నారట.
మల్కాజిగిరి నుండి పోటీ చేస్తారని కూడా వినిపించినప్పటికీ... కాకినాడ వైపై పవన్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలలో పోటీ చేయడం కాకుండా... బలం ఉంటుందని భావిస్తున్న చోట్ల అభ్యర్థులను నిలబెట్టాలని పవన్ యోచిస్తున్నారు.
సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ కొత్త పార్టీ కసరత్తు చేస్తోందట. ఈ పార్టీ ఏర్పాటు వలన కోస్తాలో, ప్రధానంగా గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సామాజిక సమీకరణలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

విభజన వల్ల బాగా దెబ్బతిన్న కాంగ్రెస్‌ను వదిలిపెట్టిన అనేక మంది నేతలు, వారి అనుచరులు కొత్త పార్టీలో చేరేందుకు తాపత్రయపడుతున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ, పవన్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆందోళన చెందుతోంది.
మంచి వక్త అయిన పవన్ కళ్యాణ్ తొలి దశలో ఎంపిక చేసిన సీట్లలో పోటీచేసి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్తులో పార్టీని పూర్తి స్థాయిలో నిర్మించాలని యోచిస్తున్నారు. 2008లో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ విఫలమైనప్పటికీ పవన్ కళ్యాణ్ పార్టీ మాత్రం హిట్టవుతుందనే అభిమానులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications