జనసేన నుండి స్థానికసంస్థల ఎన్నికలలో పోటీ చేయాలనుకునేవారికి పవన్ కళ్యాణ్ ఓపెన్ ఆఫర్!
జనసేన పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే ఆశావహులకు ఓపెన్ ఆఫర్ ఇస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. మేయర్, కార్పొరేటర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ తదితర పదవులకు పోటీ చేయాలనుకునే వారు పార్టీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని పవన్ కళ్యాణ్ అవకాశం ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల సన్నాహకాలకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హాక్ కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి సమాచారం సేకరించి, స్థానిక సమస్యలు, పార్టీ బలం, ఆశావహుల నేపథ్యం తెలుసుకుని నివేదికలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ, ప్రచారం, కూటమి సమన్వయం, ట్రెజరీ వంటి కేంద్ర కమిటీలను కూడా నియమించారు.

కూటమి భాగస్వామ్యంలో జనసేనకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని పవన్ కల్యాణ్ ఇటీవల స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో జనసైనికులు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, స్థానిక సంస్థల్లో కూడా సరైన భాగస్వామ్యం ఉండాలని అన్నారు. పార్టీ ఇప్పుడు కేవలం సీట్ల పంపకం కాకుండా, ప్రజలకు దగ్గరగా ఉండి సమస్యలు పరిష్కరించగల అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఓపెన్ ఆఫర్ ద్వారా జనసేన క్షేత్రస్థాయిలో కొత్త శక్తిని చేర్చుకోవాలని భావిస్తోంది. గతంలో ఎన్నికల్లో పోటీ చేసినవారు, పార్టీ కార్యకర్తలు, సామాజిక సేవ చేస్తున్నవారు, యువ నాయకులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించిన తర్వాత స్థానిక కమిటీలు, కేంద్ర నాయకత్వం స్థాయిలో పరిశీలన జరుగుతుంది. చివరి నిర్ణయం మాత్రం పవన్ కల్యాణ్ చేతిలోనే ఉంటుంది.
అయితే పోటీ చేయాలనుకునే వారికి దరఖాస్తుల నమోదు కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేశారు. jsplocalbodyelections.com అనే అడ్రస్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది ఎంపికపై జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్ణయం తీసుకుంటారని పార్టీ స్పష్టం చేసింది. ప్రజాసేవకు సిద్ధంగా ఉన్న యువకులు, మహిళలు, అనుభవజ్ఞులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్న వేళ జనసేన ఈ అవకాశాన్ని పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ప్రజాసేవకు నిజంగా సిద్ధంగా ఉన్నవారు ఈ ఆహ్వానాన్ని స్వీకరించి ముందుకు రావాలని పార్టీ కోరుతోంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు వెంటనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలు సమర్పించవచ్చు.












Click it and Unblock the Notifications
