ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు క్రిమినల్స్‌కు సెల్యూట్ చేయకూడదు: పవన్ కల్యాణ్
పోలీసు వ్యవస్థమీదకానీ, సిబ్బందిమీద కానీ తనకు ఎటువంటి కోపం లేదని, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు క్రిమినల్స్ కు సెల్యూట్ చేసే దారుణమైన వ్యవస్థ మనదని, రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండకూడదనేదే తన ఆశయమన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దసపల్లా భూములు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. 'జనవాణి' నిర్వహిస్తే భూకబ్జాలన్నీ బయట పడతాయనే అడ్డుకున్నారని ఆరోపించారు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం
విశాఖపట్నం నుంచి విజయవాడకు చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆయనతోపాటు పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ ఆ ప్రాంతం ఎందుకు వెనకబడి ఉందని పవన్ ప్రశ్నించారు. ఒక కుటుంబం చేతిలో అధికారం పెట్టుకొని వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారని, రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడం ఒకటే మార్గమన్నారు.

క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవారిని వ్యవస్థ నుంచి దూరం చేయాలి?
క్రిమినల్ పొలిటికల్ మైండ్ సెట్ ఉన్న నాయకులను పరిపాలన వ్యవస్థ నుంచి దూరం చేయాలన్నదే తన ఉద్దేశమన్నారు. అది జరగకపోతే ఏపీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందన్నారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తుందన్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసమే ఎన్నికల్లో పోరాడతామన్నారు.
తన విమర్శలు ఎప్పుడూ విధానపరంగానే ఉంటాయన్నారు. 'విశాఖ గర్జన' తర్వాత జనవాణిని ప్రకటించలేదని, వైసీపీని ఇబ్బంది కలిగించడం జనసేన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఇతర పార్టీలను భయపెట్టి అదుపులో ఉంచాలనేది వైసీపీ వ్యూహంగా ఉందని, అధికారంలో ఉన్న పార్టీ గర్జించడమేంటని ప్రశ్నించారు. వైసీపీ కోరుకుంటున్న హింసను తాము ఇవ్వలేమన్నారు.
మా ఆంధ్రప్రదేశ్ ను మా తెలుగు నేలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు మేము ఢిల్లీ దాకా వెళ్లము ఇక్కడే తేల్చుకుంటాం. వైసీపీకి చెప్తున్నా ఇక్కడే తేల్చుకుంటాం.. - JanaSena Chief Sri PawanKalyan pic.twitter.com/75QToSNJxO
— JanaSena Party (JanaSenaParty) October 17, 2022
కుల గొడవలతో నిస్సారమైపోతున్న ఏపీ!
కుల గొడవలతో ఏపీ నిస్సారమైపోతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు ఒకసారి, తెలంగాణ మరోసారి తరిమేశాయని, అంతర్గత విభేదాలతో మనమే నష్టపోతున్నామన్నారు. మంత్రుల కార్లపై దాడులు జరుగుతుంటే పోలీసులు ఏమయ్యారని ప్రశ్నించారు. వైసీపీ శ్రేణులు దాడిచేస్తే భావప్రకటనా స్వేచ్ఛ అని.. ఇతర పార్టీలు చేస్తే అన్ని సెక్షన్లు వర్తిస్తాయా? అని ప్రశ్నించారు. 'విశాఖ గర్జన' విఫలం కావడంవల్లే జనవాణిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. 105 మంది హత్యాయత్నం కేసు పెట్టారని, దుర్మార్గమైన చర్య అని, గర్జనకు లేని ఆంక్షలు పవన్ కల్యాణ్ 'జనవాణి'కి ఎందుకు వస్తాయని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications