పవన్ కే ఎంట్రీ లేని కాకినాడ పోర్టు? షిప్ లోకి వెళ్లనివ్వని వైనం-ఏం జరుగుతోంది?
ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలో సైలెంట్ గా కనిపించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తిగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున సాగిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్.. అధికారంలోకి వచ్చీ రాగానే దీనిపై ఫోకస్ పెట్టారు.
తమ పార్టీకే చెందిన పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను తరచూ అక్కడికి పంపి బియ్యం రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో రేషన్ మాఫియా అలర్ట్ అయింది. దీంతో పాటు వారికి సహకరిస్తున్న అధికారులూ అలర్ట్ అయ్యారు.

దీని ఫలితమే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కు రెండు నెలలుగా కాకినాడ పోర్టులో లభించని ఎంట్రీ. కూటమి ప్రభుత్వం వచ్చాక పౌరసరఫరాల మంత్రిగా నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుని, వేల టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే పవన్ కల్యాణ్ అక్కడికి వస్తే విషయం పెద్దవుతుందని భావించిన అధికారులు ఆయన రాకుండా శతవిథాలుగా ప్రయత్నాలు చేశారని నిన్న ఆయనే స్వయంగా చెప్పేశారు. దీంతో ఓ డిప్యూటీ సీఎంనే అడ్డుకునే స్ధాయిలో అధికారులు, రేషన్ మాఫియా ఉందన్న చర్చ జరుగుతోంది.
కాకినాడ పోర్టుకు పవన్ రాకుండా అధికారులు అడ్డుకోవడానికి చెప్పిన కారణం 10 వేల మంది ఉపాధి పోతుందని. కాకినాడ పోర్టులో పనిచేస్తున్న లేదా దానిపై ఆధారపడిన 10 వేల మంది ఉపాధి పోతుందనే సాకుతో పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి రచ్చ చేయకుండా అధికారులు అడ్డుకున్నారనే విషయం నిన్న పవన్ కళ్యాణ్ టూర్ తో బయటపడింది. ఇది అక్కడితో ఆగలేదు. తాజాగా కాకినాడ కలెక్టర్ సముద్రంలోకి వెళ్లి మరీ రేషన్ బియ్యం అక్రమంగా తీసుకెళ్తున్న దక్షిణాఫ్రికా ఓడను పట్టుకున్న తర్వాత పవన్ అక్కడికి వెళ్లి తీరాలని నిర్ణయించుకున్నాక కూడా అధికారుల తీరు మారలేదు.
నిన్న కాకినాడ పోర్టుకు వెళ్లిన పవన్ ను అధికారులు అడుగడుగునా అడ్డుకున్నారు. చివరికి దక్షిణాఫ్రికా షిప్ వరకూ వెళ్లి దాన్ని ఎక్కేందుకు పవన్ చేసిన ప్రయత్నాలకూ ఆటంకాలు కల్పించారు. వాతావరణం అనుకూలంగా లేదనే కారణాలూ చెప్పారు. అయినా పవన్ ను మాత్రం అడ్డుకోలేకపోయారు. చివరికి పవన్ రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. దీంతో కాకినాడ పోర్టులో లోపాలన్నీ బయటపడ్డాయి. రోజుకు వెయ్యి లారీలు వచ్చే కాకినాడ పోర్టుకు కేవలం 16 మందితో భద్రత కల్పించడం, పోర్టుకు వెళ్తున్న లోడును చెక్ చేసే యంత్రాంగం కూడా అక్కడ లేదని తెలుస్తోంది.
ఇలాంటి పరిస్ధితుల్లో కసబ్ లాంటి ఉగ్రవాదులు కూడా సులువుగా దేశంలోకి చొరబడేందుకు ఈ పోర్టు అనువుగా ఉందని పవన్ తేల్చిచెప్పేశారు. దీనిపై కేంద హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు కానీ, ప్రభుత్వంలో ఇతర మంత్రులు, పెద్దలు కానీ పల్లెత్తు మాట మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం చూస్తుంటే లోలోపల ఏదో జరుగుతోందన్న చర్చకు కారణమవుతోంది. అదే సమయంలో కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు మౌనంపైనా పవన్ అక్కడికక్కడే ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications