లాక్ డౌన్ నేపధ్యంలో ఏపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ మరో విజ్ఞప్తి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లాక్ డౌన్ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు . సరిహద్దుల్లో ఇబ్బంది పడుతున్న వారిని వారి ఇళ్ళకు చేర్చాలని విజ్ఞప్తి చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ముందు మరో డిమాండ్ ఉంచారు. కరోనా ఎఫెక్ట్ తో రైతాంగం నష్టపోతుందని , ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి రైతులను ఆదుకోవాలని పవన్ సీఎం జగన్‌ను కోరారు.

మామిడి రైతులను ఆదుకోవాలి.. రుణాల చెల్లింపు పొడిగించాలి
ఇక లాక్ డౌన్ నేపధ్యంలో రాష్ట్ర సరిహద్దులు మూసివేయడంతో చాలా మంది మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించారు.ఇక అంతే కాదు స్వయం సహాయక సంఘాల వారు కరోనా ప్రభావంతో బయటకు వెళ్ళలేని పరిస్థితిలో , ఎలాంటి సంపాదన లేకుండా ఉన్నారని , ఇక వారి రుణాల చెల్లింపును జూన్ వరకూ వాయిదా వేసి ఆ సభ్యుల ఆవేదనను తగ్గించాలని కోరారు.

సామాన్యులకు సర్కార్ అండగా ఉండటం అవసరం
ఈ విపత్కర పరిస్థితుల్లో జనసేన పార్టీ ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. ఇక తన వంతు సాయంగా 50లక్షల రూపాలను ప్రకటించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం సామాన్యులకు ఈ సమయంలో అండగా ఉండాలని కోరారు. ఇక తెలంగాణా ప్రభుత్వ పని తీరును ఉద్దేశించి ఈ క్లిష్ట తరుణంలో కేసీఆర్ నేతృత్వంలో సమర్థవంతంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించటంలో కేటీఆర్ కీలక భూమిక పోషిస్తున్నారని పేర్కొన్నారు .

కేటీఆర్ కు అభినందన .. రిలీఫ్ ప్యాకేజ్ ఒక ఊరట
ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఇక కరోనా వైరస్ రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజ్ విపత్కర తరుణంలో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకునేలా ఉందన్నారు. కాస్తంత ఊరట అని పేర్కొన్నారు . అలాగే ఇదే సమయంలో ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా నెలవారీ ఈఎమ్‌ఐ చెల్లింపులను జూన్ వరకూ వాయిదా వేయడాన్ని పరిశీలించాలని నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు పవన్.












Click it and Unblock the Notifications