అమరావతి అలా కాకూడదు: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఆంతర్యం?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమరావతి హైదరాబాదులా కాకూడదని ఆయన అన్న మాటల్లోని మర్మాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నారు. అమరావతి ఆహ్వాన పత్రాన్ని అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని శ్రీనివాస్, అయన్నపాత్రుడు తన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ ఏమైందనేది పవన్ కళ్యాణ్ మాటల నుంచి ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత 60 ఏళ్లుగా హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. రాజధాని ప్రాంతం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఉద్యమం చేపట్టి దాన్ని సాధించుకుంది. తెలంగాణను వదులుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. దాంతో భారీయెత్తున, ఆర్భాటంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అంత సజావుగా లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించారా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే, రాయలసీమ ప్రాంత నాయకులు నామమాత్రంగానే అయినా తమ ప్రాంతం వివక్షకు గురవుతోందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మద్రాసు నుంచి విడిపోయిన సమయంలో రాయలసీమ ప్రాంతం శ్రీబాగ్ ఒడంబడిక చేసుకున్న తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కలవడానికి ఇష్టపడింది.
అప్పుడు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1956లో హైదరాబాద్ రాజధాని అయింది. దాంతో అప్పటి నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలు హైదరాబాదును తమ రాజధానిగా భావిస్తూ వచ్చారు. తెలంగాణ విడిపోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంత ప్రజలకు రాజధాని లేకుండా పోయింది.
భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు పొడసూపితే పరిస్థితి ఏలా ఉంటుందోననే ఆందోళన పవన్ కళ్యాణ్ మాటల ఆంతర్యమని అంటున్నారు. ఏమైనా, భవిష్యత్తు పట్ల పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేలా ఉన్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications