పవన్ కళ్యాన్ స్పందనపై ఉత్కంఠ: రేపే కాకినాడ సభ, భారీ ఏర్పాట్లు
తూర్పుగోదావరి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం కాకినాడలో నిర్వహించ తలపెట్టిన 'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ'కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం మూడంచెల కార్యాచరణ ప్రకటించిన పవన్ కళ్యాణ్ అందులో భాగంగా తొలి సమావేశాన్ని కాకినాడలో నిర్వహించనున్నారు.
'సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ': ఇది పవన్ పెట్టిన పేరు, 9న
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని బుధవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. హోదాకు మించి ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని కూడా తెలిపింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి తదితరులు భేటీ అయి ప్రత్యేక ప్యాకేజీ అంశంపై బుధవారం చర్చించారు.
ఏడాదికి రూ. 3వేల కోట్ల లేదా 1.5లక్షల కోట్లు ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తుది ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ప్రత్యేక ప్యాకేజీ పట్ల కేంద్రానికి ధన్యవాదాలు చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు.. తమకు హోదాతోనే సంతోషమని అన్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ శుక్రవారం నిర్వహించే ఆత్మగౌరవ సభలో ఏ విధంగా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రత్యేక హోదా కావాలని పట్టుబడుతున్న పవన్ కళ్యాణ్.. కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీకి ఒకే చెబుతారా? లేక హోదా తప్ప మరేం అవసరం లేదని అంటారా? అనేదానిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పవన్ స్పందన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, కాకినాడ జేఎన్‌టీయూ క్రీడా మైదానంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ నిర్వహించేందుకు అనుమతి కోరినట్లు కాకినాడ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మైదానం సామర్థ్యం 75,000 వరకు ఉంటుందని అనుమతి లేఖలో నిర్వాహకులు పేర్కొన్నట్లు చెప్పారు.
11.6 ఎకరాల విస్తీర్ణం ఉన్న మైదానంలో సభా ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి.మరోవైపు, పవన్ సభ విజయవంతం కావాలని కోరుతూ.. కాకినాడ గ్రామీణం పరిధిలోని రాజ్యలక్ష్మి సమేతభావనారాయణస్వామి ఆలయంలో జనసేన కార్యకర్తలు బుధవారం పూజలు నిర్వహించారు.
అక్కడి నుంచి తాళ్లరేవు మండలం మట్లపాలెంలోని మహలక్ష్మమ్మ ఆలయం వరకు 22 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. రాజమహేంద్రవరం, అమలాపురం పరిధిలోనూ జనసేన కార్యకర్తలు పాదయాత్రలు నిర్వహించారు.
రెండు రోజులు జిల్లాలోనే పవన్
కాకినాడ సభ కోసం తూర్పుగోదావరి జిల్లాకు వస్తున్న పవన్ కళ్యాణ్ రెండు రోజులపాటు జిల్లాలోనే ఉంటారని తెలిసింది. శుక్రవారం జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్న ఆయన శనివారం అచ్చంపేటలోని కిరణ్ కంటి ఆస్పత్రిని సందర్శించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications